ఆమ్‌స్టర్‌డాంలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌లోకి చొరబడిన ఆందోళనకారులు
ABN , Publish Date - Nov 07 , 2026 | 09:39 AM
యూరప్‌లో డేటా సెంటర్ల నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో మైక్రోసాఫ్ట్ నిర్మిస్తున్న నూతన డేటా సెంటర్ నిర్మాణ ప్రాంతంలోకి శుక్రవారం ఆందోళనకారులు చొరబడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: యూరప్‌లో డేటా సెంటర్ల నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో మైక్రోసాఫ్ట్ నిర్మిస్తున్న డేటా సెంటర్ నిర్మాణ ప్రాంతంలోకి శుక్రవారం ఆందోళనకారులు చొరబడ్డారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో అదుపులోకి తెచ్చేందుకు 150 నుంచి 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న డేటా సెంటర్లకు విద్యుత్తు, నీరు విపరీతంగా వాడుతుండడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళనకారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వాటి నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్ర, శనివారాల్లో యూరప్‌వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఐర్లాండ్, పోలండ్, డెన్మార్క్, ఫిన్లాండ్, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, బ్రిటన్ సహా 15 దేశాల్లో పలు పౌర సంఘాలు, స్థానిక సంస్థలు ఈ ఆందోళనల్లో పాల్గొననున్నాయి.
ఏఐ పేరుతో విధ్వంసమే
డేటా సెంటర్ల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆందోళనకారులు చెప్పారు. వాటిని ఏఐ దుర్వినియోగం, యుద్ధ కార్యకలాపాలు, నిఘా వ్యవస్థలు, మారణహోమాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిర్మాణ పనులు నిలిపివేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా.. శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును గౌరవిస్తామని, అదేసమయంలో చట్టవ్యతిరేకమైన, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే చర్యలను సమర్థించబోమని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తెలిపారు.
జర్మనీ, పోలండ్‌లోనూ నిరసనలు
జర్మనీలోని బెర్లిన్ శివారులో ఉన్న ఓ డేటా సెంటర్ వద్ద కూడా శుక్రవారం 12 మంది నిరసన తెలిపారు. పర్యావరణ అంశాలను పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పోలండ్‌లోనూ పార్లమెంట్ ఎదుట సుమారు 100 మంది నిరసన చేపట్టారు. వార్సా పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదించిన డేటా సెంటర్ల నిర్మాణాలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు . ఇటలీలోనూ డేటా సెంటర్లపై నిరసనల సెగ వ్యక్తమైంది. ఉత్తర ప్రాంతంలోని లొంబార్డీలో నిర్మిస్తున్న డేటా సెంటర్‌ను స్థానికుల వ్యతిరేకిస్తున్నారు.
ఇవీ చదవండి:
వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్.. ట్రంప్ ప్రకటన
మిషిగన్ హౌస్ స్పీకర్‌గా రంజీవ్ పురి