మస్క్ కంపెనీలపై దర్యాప్తు!
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:03 AM
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీని గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమైన అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ప్రతిపక్ష డెమోక్రాట్లు దృష్టిపెట్టారు.
అమెరికా కుబేరుడిపై ప్రతిపక్షడెమొక్రాట్ల మండిపాటు
విచారణ జరుపుతామని ప్రకటన
‘మిడ్‌టర్మ్’లో రిపబ్లికన్లకు మస్క్4,476 కోట్ల విరాళాలు
వాషింగ్టన్, నవంబరు 5: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీని గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమైన అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ప్రతిపక్ష డెమోక్రాట్లు దృష్టిపెట్టారు. ఆయన కంపెనీలు, ప్రభుత్వం నుంచి పొందిన కాంట్రాక్టులు, టెక్సాస్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న భారీ డేటా సెంటర్లపై విచారణ జరుపుతామని ప్రకటించారు. మస్క్ గతంలో గవర్నమెంట్ ఎఫిషియెన్సీ విభాగానికి అధిపతిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై కూడా దర్యాప్తు నిర్వహిస్తామని డెమోక్రాటిక్ నేత జోలాప్‌గ్రెన్ ప్రకటించారు. రిపబ్లికన్లు, వారి మద్దతుదారులు ఇక న్యాయవాదులను నియమించుకోవాలని సెనేటర్ బ్లూమెంథాల్ గురువారం హెచ్చరించారు. మస్క్ కంపెనీలు అమెరికన్ యువత జీవితాలను నాశనం చేశాయని జోలాఫ్‌గ్రెన్ ఆరోపించారు. మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలతో ఇప్పటికే మస్క్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఎన్నికల ఫలితాల సరళి మొదలవగానే మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల షేర్ల విలువ స్టాక్ మార్కెట్‌లో భారీగా పతనమైంది. టెస్లా షేరు విలువ బుధవారం (అమెరికా కాలమానం) 5.1శాతం, స్పేస్‌ఎక్స్ షేరు విలువ 5.5శాతం పడిపోయాయి. గురువారం మరింత దిగజారి ఈ రెండు కంపెనీల షేర్ల విలువ 10 శాతం వరకు పడిపోయాయి. ప్రజలు కూడా మస్క్‌పై తిరగబడుతున్నారు. టెక్సా్‌సలో ఆయన నిర్మిస్తున్న డేటా సెంటర్లు, సెమీకండక్టర్ కంపెనీలకు విద్యుత్ భారీగా అవసరం ఉండటంతో తమకు విద్యుత్ కొరత ఏర్పడుతుందని ఆ రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. దీంతో వాటిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.
రిపబ్లికన్ల కోసం రూ.4,476 కోట్ల ఖర్చు
ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లను గెలిపించేందుకు మస్క్ డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టారు. ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు ఆయన ఏకంగా రూ.4,476 కోట్లు విరాళంగా ఇచ్చారు. ముఖ్యంగా తన కంపెనీలు టెస్లా, స్పేస్‌ఎక్స్ ఉన్న టెక్సాస్ రాష్ట్రంపై ఆయన అధికంగా ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికల్లో తనకు అనుకూలురైన నేతలను గెలిపించుకొనేందుకు చివరి వరకు ప్రయత్నించారు. మొత్తం విరాళాల్లో దాదాపు సగం రూ.2,115 కోట్లు ఈ ఒక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టడానికే ఎన్నికల ప్రచార సంస్థలైన సూపర్ ప్యాక్‌లకు అందించారు. అమెరికా చట్టాల ప్రకా రం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికిగానీ, వారి పార్టీకిగానీ వ్యక్తిగతంగా భారీ మొత్తాల్లో విరాళాలు ఇవ్వటం కుదరదు. అందుకే అక్కడ పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ)లు, సూ పర్ పీఏసీలు ఉంటాయి. మస్క్‌లాంటి కుబేరులు ఈ సూపర్ పీఏసీలకు వేలకోట్ల నిధులు ఇచ్చి, తమ కు నచ్చిన పార్టీ, అభ్యర్థి కోసం ప్రచారం చేయిస్తారు. ఆయన మొత్తం విరాళాల్లో ఒక్క సెప్టెంబరులోనే రూ.1,491 కోట్లు ఇవ్వటం విశేషం. టెక్సాస్‌లో రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి కెన్‌పాక్స్‌టన్, సిటింగ్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్‌ల ఎన్నికల ప్రచారం కోసమే ఇందులో అత్యధిక మొత్తం ఖర్చుపెట్టారు. అయినా, వారిద్దరూ ఓడిపోయారు. 1990 తర్వాత ఇక్కడ డెమోక్రాట్లు సెనేట్ సీటు గెలవటం ఇదే తొలిసారి. రిపబ్లికన్ల ఓటమిపై మస్క్ స్పందించారు. ‘గగనతలం నుంచి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే నా స్పేస్ లేజర్లు ఈసారి పనిచేయలేదు. ఇకపై డేటా సెంటర్లు ఆకాశంలో ఏర్పాటు చేసుకోవాలేమో!’ అని సెటైర్ వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భారతీయ అమెరికన్లను దూరం చేసుకున్న రిపబ్లికన్లు
యూరప్‌లో విమానాలకు బాంబు బెదిరింపులు.. దారి మళ్లించిన అధికారులు..