Share News

మోదీ ప్రజలతో నేరుగా మాట్లాడతారు!

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:33 AM

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల సందర్భంగా విలేకరుల సమావేశాలు నిర్వహించక పోవడం మరోసారి వివాదాస్పదమైంది. తాజాగా న్యూజీలాండ్‌ పర్యటనలోనూ శనివారం ఇరు దేశాల ప్రధానుల...

మోదీ ప్రజలతో నేరుగా మాట్లాడతారు!

  • ఆయనకు మీడియా లాంటి మధ్యవర్తులక్కర్లేదు

  • ప్రెస్‌మీట్లు పెట్టకపోవడంపై విదేశాంగ శాఖ వివరణ

ఆక్లాండ్‌, జూలై 11: ప్రధాని మోదీ విదేశీ పర్యటనల సందర్భంగా విలేకరుల సమావేశాలు నిర్వహించక పోవడం మరోసారి వివాదాస్పదమైంది. తాజాగా న్యూజీలాండ్‌ పర్యటనలోనూ శనివారం ఇరు దేశాల ప్రధానుల శిఖరాగ్ర సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చినపుడు ఆయన ప్రశ్నోత్తరాల సెషన్‌ పెట్టుకోలేదు. భారత ప్రధాని విలేకరుల ముందు తాను అనుకున్నది మాట్లాడటమే తప్ప వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడాన్ని న్యూజీలాండ్‌ మీడియా కూడా ప్రస్తావించింది. గత రెండు నెలల్లో ఈ ప్రశ్న తలెత్తడం ఇది మూడో సారి. మీడియా నుంచి మోదీ ప్రశ్నలు ఎందుకు తీసుకోవడం లేదని న్యూజీలాండ్‌ విలేకరి ఒకరు భారత విదేశాంగ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్‌ను ప్రశ్నించారు. మోదీ రాజకీయ వ్యూహాలను ప్రశ్నించడం సివిల్‌ సర్వెంట్‌ అయిన తనకు తగదని టాండన్‌ బదులిచ్చారు. మోదీ భారతదేశంలో అత్యంత విజయవంతమైన రాజకీయ నాయకుడని చెప్పారు. సాధారణంగా భారత రాజకీయ నాయకులు తమ ఓటర్లతో నేరుగా మాట్లాడాలని కోరుకుంటారని అన్నారు. ఓటర్లు కూడా మధ్యలో మరొకరితో పాఠాలు చెప్పించుకోవడానికి ఇష్టపడరని, మధ్యవర్తులు లేకుండా నేరుగా నేత మాట్లాడేదే వినాలి అనుకుంటారని వివరించారు. నార్వే రాజధాని ఓస్లోలో మహిళా విలేకరి హెల్లే లింగ్‌ రెండు నెలల క్రితం మోదీని ప్రశ్నించి సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. శనివారం విదేశాంగ కార్యదర్శి సమాధానాన్ని నార్వే విలేకరి హెల్లే లింగ్‌ షేర్‌ చేస్తూ, ‘‘అయితే, జంతర్‌మంతర్‌ దగ్గర ఽధర్నా చేస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులతో ఇప్పటికే మోదీ నేరుగా మాట్లాడి ఉండాల్సిందే? కానీ, నాకు అలాంటి వీడియోలేవీ తారస పడలేదే’’ అని కామెంట్‌ చేశారు. ఇదిలా ఉండగా, భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030కల్లా రెట్టింపు చేసి రూ.35 వేల కోట్లకు చేర్చాలని ప్రధాని మోదీ, న్యూజిలాండ్‌ ప్రధాని లక్సన్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ శనివారం లక్సన్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో 10 ఒప్పందాలతో కలిపి మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలను ఇరు దేశాలు ప్రకటించాయి.

ఈ వార్తలు కూడా చదవండి...

క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్‌ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 05:33 AM