Share News

మెలోనీకి మెలోడీ

ABN , Publish Date - May 21 , 2026 | 05:56 AM

భారత ప్రధాని నరేంద్రమోదీ.. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి ఊహించని బహుమతి ఇచ్చారు. భారత్‌లో దాదాపు ప్రతి చిన్నారీ ఎంతో ఇష్టంగా తినే, ఎంతో చవకైన పార్లే మెలోడీ చాక్లెట్లను...

మెలోనీకి మెలోడీ

ఇటలీ ప్రధానికి చాక్లెట్‌ ప్యాకెట్‌ ఇచ్చిన మోదీ

రోమ్‌లోని కలోసియంలో ఇద్దరు ప్రధానుల సెల్ఫీ

‘పరిశ్రమ్‌ హీ సఫల్తా కీ కుంజీ హై’ అని హిందీలో మాట్లాడి ఆకట్టుకున్న మెలోనీ

ఇటలీ అఽధ్యక్షుడు, ప్రధానితో మోదీ చర్చలు

మోదీకి ప్రతిష్ఠాత్మక ఎఫ్‌ఏవో అగ్రికోలా మెడల్‌ ప్రదానం

5 దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికి ప్రధాని

మోదీ, అమిత్‌ షా ద్రోహులు.. కొద్దిమంది వ్యక్తులకు దేశ ప్రయోజనాలు తాకట్టు: రాహుల్‌ గాంధీ

రోమ్‌, మే 20: భారత ప్రధాని నరేంద్రమోదీ.. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి ఊహించని బహుమతి ఇచ్చారు. భారత్‌లో దాదాపు ప్రతి చిన్నారీ ఎంతో ఇష్టంగా తినే, ఎంతో చవకైన పార్లే మెలోడీ చాక్లెట్లను ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ఇటలీకి చేరుకున్న ఆయన.. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు సెర్జియో మటరెలాతోపాటు ప్రధాని మెలోనీతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మెలోనీతో అధికారిక సమావేశానికి ముందు భారత్‌లో మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్‌ను ఆమెకు బహుమతిగా అందించి ఆశ్చర్యపరిచారు. మోదీ మెలోడీ చాక్లెట్లు ఇస్తున్న వీడియోను మెలోనీ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి సంతోషం వ్యక్తంచేశారు. ‘ప్రధాని నరేంద్రమోదీ నాకు ఒక బహుమతి ఇచ్చారు. అది ఎంతో మంచి చాక్లెట్‌.. మెలోడీ’ అని తెలిపారు. మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆ వీడియోలో భారత ప్రధాని బహుమతి ఇస్తూ నవ్వుతూ కనిపించారు. మోదీ బహుమతి సోషల్‌ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై వేలకొద్దీ కామెంట్లు వచ్చాయి. చాలామంది ‘మెలోనీ+మోదీ=మెలోడీ’ అని కామెంట్లు పెట్టారు.


మెలోనీ నోట హిందీ మాట

ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ, మెలోనీ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మెలోనీ హిందీలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ‘పరిశ్రమ్‌ హీ సఫల్తా కీ కుంజీ హై’ అని పేర్కొన్నారు. ఈ మాటకు అర్థం కూడా వివరించారు. కఠిన శ్రమతోనే విజయం సాధ్యం అని అన్నారు. భారత్‌లో ఈ మాట తరచుగా వినిపిస్తుందని, తమ రెండు దేశాల మధ్య సంబంధాలను కూడా గొప్ప స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. భారత్‌, ఇటలీ సంబంధాలకు టెక్నాలజీ, ఆవిష్కరణలే ఇంజన్లని మోదీ తెలిపారు. రెండు దేశాల రక్ష ణ పరిశ్రమలతోపాటు సైన్యాల మధ్య కూడా సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. వాణిజ్యం, టెక్నాలజీ, శుద్ధ ఇంధనం, ఏఐ, అంతరిక్ష సాంకేతిక, అణు ఇంధనం, సాంస్కృతిక సంబంధాలపై తాము చర్చించినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి రోమ్‌కు చేరుకున్న మోదీకి ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తజనీ స్వాగతం పలికారు. మోదీ గౌరవార్థం ఇటలీ ప్రధాని విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రధానులు రోమ్‌లోని ప్రాచీన కలోసియంను సందర్శించారు. అక్కడ మోదీతో మెలోనీ సెల్ఫీ తీసుకొని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయటంతో వైరల్‌గా మారింది. 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిదైన ఇటలీ పర్యటన ముగించుకున్న మోదీ.. తిరిగి స్వదేశం చేరుకున్నారు.


223-natinal.jpg

సంక్షోభం వేళ రీల్స్‌తో మోదీ బిజీ: రాహుల్‌

మెలోనీకి మోదీ మెలోడీ చాక్లెట్లు బహుమతిగా ఇవ్వటంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తరుముకొస్తుంటే మోదీ రీల్స్‌ చేయటంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ‘దేశంలో ఆర్థిక సంక్షోభం తరుముకొస్తోంది. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులు కష్టాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మన ప్రధాని మాత్రం ఇటలీకి మెలోడీ చాక్లెట్లతో వెళ్లారు. నవ్వుతూ రీల్స్‌ చేయటంలో బిజీగా ఉన్నారు. ఇది నాయకత్వ లక్షణం కాదు.. గిమ్మిక్‌. బీజేపీ శ్రేణులు ఆయన వీడియోలను చూసి చప్పట్లు కొడుతున్నారు’ అని ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. అయితే, రాహుల్‌ విమర్శలపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘‘రాహుల్‌ గాంధీ వాడే భాష శత్రుదేశాల ప్రజలు వాడే భాష’’ అన్నారు.

మోదీకి అగ్రికోలా మెడల్‌

ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక అగ్రికోలా మెడల్‌ ప్రధాని మోదీకి లభించింది. రోమ్‌లోని ఎఫ్‌ఏవో ప్రధాన కార్యాలయాన్ని మోదీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎఫ్‌ఏవో డైరెక్టర్‌ జనరల్‌ క్యూ డోంగ్యు ఈ మెడల్‌ను ప్రదానం చేశారు. ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి చేసిన కృషికి గాను మోదీకి ఈ మెడల్‌ ప్రదానం చేసినట్లు ఎఫ్‌ఏవో ఓ ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయ దౌత్యంలో రూపాయి చాక్లెట్‌

మెలోడీ.. చిన్నారులకు ఎంతో ఇష్టమైన చాక్లెట్‌.. వీధి చివర్లో, కాలనీలో ఎక్కడ చిన్న బడ్డీ కొట్టు ఉన్నా.. అందులో తప్పకుండా కనిపించే తియ్యని చాక్లెట్‌ ఇది. మనదేశంలో పట్నం నుంచి పల్లె వరకు ఎక్కడికెళ్లినా కనిపిస్తుంది. ఒక్క రూపాయి మాత్రమే విలువ చేసే ఈ చాక్లెట్‌ నేడు మోదీ మూలంగా అంతర్జాతీయ దౌత్యంలో భాగమైంది. ఈ చాక్లెట్‌ను పార్లే సంస్థ 1983లో మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటిని చిన్నారులు అమితంగా ఇష్టపడటంతో పెద్దగా ప్రచారం లేకుండానే దేశవ్యాప్తంగా విరివిగా అమ్ముడవుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 05:57 AM