Share News

భారత పైలట్లకు చెడ్డపేరు రాకుండా కాపాడాడు: పైలట్ మచ్చార్ మామ

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:29 PM

ఫ్లైదుబాయ్ విమానం కూలిపోయుంటే తప్పుడు సంకేతం వెళ్లేదని, భారత పైలట్లకు చెడ్డపేరు రాకుండా స్మిత్ మచ్చార్ కాపాడారని ఆయన మామ (మచ్చార్ భార్య తండ్రి) జైసుఖ్ జోగి అన్నారు.

భారత పైలట్లకు చెడ్డపేరు రాకుండా కాపాడాడు: పైలట్ మచ్చార్ మామ

ఇంటర్‌నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానం కూలిపోయుంటే తప్పుడు సంకేతం వెళ్లేదని, భారత పైలట్లకు చెడ్డపేరు రాకుండా స్మిత్ మచ్చార్ కాపాడారని ఆయన మామ (మచ్చార్ భార్య తండ్రి) జైసుఖ్ జోగి అన్నారు. కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. దేశానికి చెడ్డపేరు రాకుండా మచ్చార్ కాపాడారని ఆయన చెప్పారు. శనివారం ఓ టీవీ చానెల్‌తో ఆయన మాట్లాడారు. ‘‘విమానం కూలిపోయుంటే, ఒక భారతీయ పైలట్ నడుపుతుండగా విమానం కూలిపోయిందనే తప్పుడు సంకేతం వెళ్లేది. అంతేకాకుండా భారతీయ పైలట్లకూ అపవాదు వచ్చేది. అట్లాంటిదేమీ జరగకుండా మచ్చార్ చూశాడు. యావద్దేశానికీ ఆయన మంచి చేశాడు. మేమంతా మా అల్లుడిని చూసి గర్విస్తున్నాం. శరీరం రక్తమోడుతున్నా బలాన్నంతా కూడదీసుకుని కాక్‌పిట్ తలుపు తెరిచి విమానం కూలిపోకుండా చూశాడు’’ అని జైసుఖ్ పేర్కొన్నారు.


ముందు షాకయ్యాం..

తమ అల్లుడు స్మిత్ మచ్చార్‌పై దాడి జరిగిందన్న వార్త తెలిసి తామంతా షాక్ అయ్యామని జైసుఖ్ తెలిపారు. తర్వాత వార్తలు చూసి రిలాక్స్ అయ్యామని చెప్పారు. ‘‘మచ్చార్‌పై దాడితో ఆరోజు రాత్రంతా మేము నిద్రపోలేదు. మేము చాలా ఆందోళన చెందాం. నా కూతురు సోనాల్ కూడా గాబరా పడింది. తర్వాత వార్తలు చూసి రిలాక్స్ అయ్యాం’’ అని జైసుఖ్ వివరించారు. మచ్చార్ అత్త వర్షా జోగి కూడా ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. తమ కూతురితో పాటు తన మొత్తం ఫ్యామిలీని మచ్చార్ బాగా చూసుకుంటాడని చెప్పారు. ప్రవర్తనపరంగా ఆయన త్వరగా భావోద్వేగానికి గురవుతాడని వెల్లడించారు. మచ్చార్ ప్రతిఒక్కరినీ ప్రేమిస్తాడని తెలిపారు.


ఇవీ చదవండి:

పర్వతాలు.. శిఖరాలు.. సరస్సులు.. లద్దాఖ్‌లో 28 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు

ఏపీ మీదుగా మరో వందేభారత్‌ స్లీపర్‌‌.. హాల్ట్స్ ఇవే?

Updated Date - Oct 03 , 2026 | 01:40 PM