పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు సైనికులు సహా 16 మంది మృతి
ABN , Publish Date - Feb 21 , 2026 | 08:09 PM
పాకిస్థాన్‌లో మరో పెద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా పౌరులూ మరణించినట్టు సమాచారం. వారిలో ఓ లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో శనివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పాక్ సైనికులు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 16 మంది మరణించారు. మృతులలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారితో పాటు పౌరులూ ఉన్నట్టు సమాచారం. అనేక మంది సైనికులు గాయపడ్డారు. ఆ దేశంలో 15 రోజుల వ్యవధిలో ఇది మూడో ఆత్మాహుతి దాడి కాగా.. ఐదు రోజుల్లో రెండోది కావడం గమనార్హం.
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్ను జిల్లా సరార్ దర్గా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని పాక్ భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో ఆత్మాహుతి దళ సభ్యుడు సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే.. సైన్యానికి చెందిన వాహనం దాడులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించినది కావడంతో పేలిపోలేదు. దీనివల్ల వాహనానికి తీవ్ర నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఓ నిఘా సంబంధిత ఆపరేషన్లో పాల్గొంటున్న కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ షాజాదా గుల్ మృతిచెందినట్టు సమాచారం.
అయితే.. అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవలి కాలంలో ఉగ్ర సంఘటనలు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం.. తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ) బజౌర్ జిల్లాలోని ఓ చెక్‌పాయింట్‌ను పేలుడు పదార్థాలతో కూడిన వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది భద్రతా సిబ్బంది సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మలంగిలోని ఓ మదర్సా ఉన్న భవనం వద్ద కూడా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లోని భవనాలు సహా అనేక ఇళ్లూ దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇవీ చదవండి:
'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'
ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్