Share News

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. పాఠశాల పైకప్పు కూలి విద్యార్థులు, ఉపాధ్యాయురాలి మృతి..

ABN , Publish Date - Oct 15 , 2026 | 01:55 PM

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాయవ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో ఒక ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలిపోవడంతో 21 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 30 మందికి పైగా గాయపడ్డారు.

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. పాఠశాల పైకప్పు కూలి విద్యార్థులు, ఉపాధ్యాయురాలి మృతి..
Pakistan school roof collapse

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాయవ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో ఒక ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలిపోవడంతో 21 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గురువారం తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది (Pakistan school roof collapse).


పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లోని దిర్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. అల్ ఖైర్ పాఠశాల భవనంలోని పైకప్పు కూలిపోవడంతో తరగతి గదుల్లో ఉన్న చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన చిన్నారులను అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు (Peshawar school accident).


విద్యార్థులు, ఉపాధ్యాయురాలితో కలిపి కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం వెలువడింది (Students killed in Pakistan). మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలుస్తోంది. మృతులంతా చిన్న వయసు పిల్లలే కావడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల భవనం నిర్మాణం బలహీనంగా ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పెషావర్ పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.


ఇవి కూడా చదవండి..

చైనా విడిభాగాలతో హూతీల క్షిపణులు.. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు ముప్పు తప్పదా..


మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 15 , 2026 | 01:59 PM