Share News

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: ప్రధాని షరీఫ్

ABN , Publish Date - Apr 30 , 2026 | 11:06 AM

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా పాక్ ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తోందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఈ పరిస్థితుల్ని అధిగమించేందుకే తాము మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: ప్రధాని షరీఫ్
Pakistan Prime Minister Shehbaz Sharif

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా.. పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ గడ్డుకాల పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్ని ముగించేందుకు పాక్ మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తోందని ఆయన స్పష్టం చేశారు. అయితే.. సౌదీ అరేబియా మద్దతుతో ఈ ప్రభావాన్ని తట్టుకోగలిగామని, తమ దేశానికి నాటో తరహా రక్షణ ఒప్పందం ఉందన్నారు.


'ఈ సంఘర్షణ త్వరలో ముగిసి ఆర్థిక స్థిరత్వం నెలకొనాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం రోజువారీ పరిస్థితుల్ని ఓ టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షిస్తోంది. ఈ సవాలును అధిగమించడం సహా యుద్ధానికి ముగింపు పలికేందుకు అన్నిరకాల ప్రయత్నాలు అవసరం. మా దేశంలో ఇప్పుడు జనాభా పెరుగుతోంది. కానీ ఈ ఆకస్మిక యుద్ధం కారణంగా.. రెండేళ్లుగా చేసిన కృషంతా వృథాగా పోయింది' అని ఫెడరల్ క్యాబినెట్ సమావేశం సందర్భంగా పాక్ ప్రధాని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి అమెరికా, ఇరాన్‌ల మధ్య పాక్ ఎందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తోందనే విషయం స్పష్టమవుతోంది.


అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయని.. దీనివల్ల ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమవడానికి ముందున్న 300 మిలియన్ డాలర్ల పాక్ దిగుమతుల బిల్లులు 800 మిలియన్ డాలర్లకు ఎగబాకాయని షరీఫ్ తెలిపారు. ఈ పరిస్థితులు తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారాయాని అభివర్ణిస్తూ, దేశంలో ఇంధన కొరతను నివారించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 'మేం 3.5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక బకాయిలను చెల్లించాం. మా ఫెడరల్ రిజర్వులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇందుకోసం మా సోదరులు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌, రాజులకు మేం కృతజ్ఞులం' అని షరీఫ్ చెప్పారు.


ఇదిలా ఉండగా.. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరుపక్షాల మధ్య పాక్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఒత్తిడి తెస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు తొలిదఫా చర్చలు ఇస్లామాబాద్‌లో జరిగ్గా.. త్వరలో రెండో విడత చర్చలూ జరిగే అవకాశముంది. అయితే.. పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్ ప్రయోజనాలను కాపాడుతున్నారని, అందుకే పాకిస్థానీలను మధ్యవర్తులుగా విశ్వసించకూడదని యూఎస్‌కు చెందిన ఓ నివేదిక పేర్కొంది. మరోవైపు.. అమెరికా-ఇరాన్ చర్చలకు పాక్ తగిన మధ్యవర్తి కాదని ఇరాన్ చట్టసభ సభ్యులొకరు ఇటీవల ప్రస్తావించారు.


ఇవీ చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..

Updated Date - Apr 30 , 2026 | 11:13 AM