Nigeria: గ్రామంపై సాయుధ దుండగుల కాల్పులు.. 30 మంది మృతి
ABN , Publish Date - Jan 04 , 2026 | 07:45 PM
దుండగులు గ్రామస్థులపై కాల్పులు జరపడంతో పాటు పలు ఇళ్లకు, స్థానిక మార్కెట్‌కు నిప్పుపెట్టినట్టు నైజర్ పోలీసు ప్రతినిధి ఒకరు చెప్పారు. మృతదేహాల వెలికితీత జరుగుతున్నందున మృతుల సంఖ్య 37కు పెరగవచ్చని గ్రామస్థులు చెబుతున్నారు.
నైజర్: నైజీరియా(Nigeria)లోని నైజర్ రాష్ట్రంలో సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం ఉదయం కసువాన్-డాజీ గ్రామంపై విరుచుకుపడి జరిపిన కాల్పుల్లో 30మందికి పైగా గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. పలువురిని దుండగులు అపహరించుకుపోయారు. కల్లోలిత ఉత్తర ప్రాంతంలో కొనసాగుతున్న హింసాకాడంలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం నాడు జరిగిన ఈ ఘటనను పోలీసులు ధ్రువీకరించారు. పలువురు జాడ తెలియకుండా పోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాల్పులు.. ఇళ్లకు నిప్పు
కాగా, దుండగులు గ్రామస్థులపై కాల్పులు జరపడంతో పాటు పలు ఇళ్లకు, స్థానిక మార్కెట్‌కు నిప్పుపెట్టినట్టు నైజర్ పోలీసు ప్రతినిధి ఒకరు చెప్పారు. మృతదేహాల వెలికితీత జరుగుతున్నందున మృతుల సంఖ్య 37కు పెరగవచ్చని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఈ దాడిలో 40 మందికి పైగా మృతి చెందినట్టు కేథలిక్ చర్చ్ రెవరెండ్ స్టీఫెన్ కబిరత్ తెలిపారు. కిడ్నాప్ అయిన వారిలో పిల్లలూ ఉన్నారని చెప్పారు. దాడికి వారం రోజుల ముందే సాయుధులు అక్కడి నివసిస్తున్న కమ్యూనిటీ ఆచూకీ తెలుసుకుని మరీ దాడులు జరిపినట్టు చెబుతున్నారు.
సుమారు మూడు గంటల సేపు కాల్పులు జరిగాయని, సురక్షితంగా బయటపడిన వారు సైతం మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు జంకుతున్నారని స్థానికులు తెలిపారు. 'మృతదేహాలు ఎక్కడివక్కడే ఉన్నాయి. సరైన భద్రత లేకుండా వాటిని ఎలా స్వాధీనం చేసుకోగలం' అని ఒక గ్రామస్థుడు ఆవేదన వ్యక్తం చేశారు.
నైజీరియా గ్యాంగులు తరచూ ఎలాంటి భద్రతకు నోచుకోని గ్రామాలను లక్ష్యంగా చేసుకుంటారు. జనసంచారం లేని విశాలమైన అడవుల్లో ఈ ముఠాలు దాక్కుంటాయని, అదను చూసి దాడులకు తెగబడుతుంటాయని చెబుతున్నారు. పపిరి కమ్యూనిటీ సమీపంలో తాజా దాడులు జరిగాయి. నవంబర్‌లో ఇక్కడి నుంచే 300 మంది స్కూలు పిల్లలు, టీచర్లను దుండగులు కిడ్నాప్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలా అత్యంత శక్తివంతమైన మహిళపై అమెరికా కేసు
వెనెజువెలా అధ్యక్షుడి కొంప ముంచిన ఛాలెంజ్!