Share News

భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి

ABN , Publish Date - Jun 07 , 2026 | 02:51 PM

భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నేపాల్ ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. ఇరు దేశాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్‌తో కొత్త అధ్యాయానికి సిద్ధం: నేపాల్ విదేశాంగ మంత్రి
Shishir Khanal, S Jaishankar

భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నేపాల్ ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. ఇరు దేశాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో నేపాల్‌కు ఎలాంటి పాత విభేదాల భారమూ లేదని, కొత్త దృక్పథంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నామని చెప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అనంతరం శిశిర్ మీడియాతో మాట్లాడారు (Nepal India relations).


'వాణిజ్యం, ఇంధన రంగం, జలవనరులు, డిజిటల్ కనెక్టివిటీ, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై రెండు దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. నేపాల్ ఆర్థికాభివృద్ధికి భారత్ అనుభవం, మార్కెట్ పరిమాణం, పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయి. కైలాస్-మానసరోవర్ యాత్ర భిన్నమైన సరిహద్దు పాయింట్ల ద్వారా జరుగుతుంది. చాలా మంది నేపాల్ గుండా కూడా ప్రయాణిస్తారు. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతం ద్వారా భారత్, చైనాల మధ్య ఒప్పందాన్ని పునరుద్ధరించడంపైనే మేం ఆందోళన చెందుతున్నాం' అని శిశిర్ పేర్కొన్నారు (Shishir Khanal, S Jaishankar).


'కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతంలోని భూమి నేపాల్‌కు చెందినది (India Nepal border issue). నేపాల్ సమ్మతి లేకుండా ఇరు దేశాలు ఆ ఒప్పందాలను చేసుకోలేవు. ఆ విషయాన్ని భారత విదేశంగా శాఖ దృష్టికి తీసుకెళ్లాం. ప్రపంచవేదికగా వేగంగా ఎదుగుతున్న భారత్‌తో కలిసి పని చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం' అని శిశిర్ పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆస్ట్రేలియా చరిత్రలో మొదటిసారి.. లక్ష బొద్దింకల సీజ్..

పరస్పర దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా

Updated Date - Jun 07 , 2026 | 04:00 PM