ట్రంప్-మొజ్తాబా మీటింగ్‌కు ఛాన్సే లేదు.. ఇరాన్ ప్రతినిధి స్పష్టీకరణ
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:17 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తమ సుప్రీం లీడర్ మొజ్తాబా సమావేశమయ్యే అవకాశం ప్రస్తుతానికైతే లేదని ఇరాన్ నేత, మొజ్తాబా ప్రతినిధి మోహిసీన్ రెజాయ్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తమ సుప్రీం లీడర్ మొజ్తాబా సమావేశమయ్యే అవకాశం ప్రస్తుతానికైతే లేదని ఇరాన్ నేత, మొజ్తాబా ప్రతినిధి మోహిసీన్ రెజాయ్ తెలిపారు. తాను మొజ్తాబాను కూడా కలవొచ్చంటూ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించడంపై రెజాయ్ ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు స్తంభించిపోయిన నేపథ్యంలో రెజాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘అది జరిగే అవకాశాలు ప్రస్తుతానికైతే లేవు. ట్రంప్ వల్ల చర్చలు స్తంభించిపోయాయి. నా అభిప్రాయం ప్రకారం, చర్చల్లో పీటముడి విప్పాల్సిన బాధ్యత ట్రంప్‌దే. విదేశాల్లోని మా ఆస్తులపై ఆంక్షలు విధించారు. వీటిని ఎత్తేయాలని ఇరాన్ బహిరంగంగానే చెబుతోంది. ఈ విషయంలో అమెరికన్లు మాత్రం వాస్తవాలను దాచిపెడుతున్నారు. చర్చలకు ట్రంప్ నిజంగానే ప్రాముఖ్యాన్ని ఇస్తే మా ఆస్తులపై ఆంక్షలను ఎత్తేయాలి. 24 బిలియన్ డాలర్లు అమెరికాకు పెద్ద లెక్కేమీ కాదు. ఇది ఇరాన్ సంపద. అమెరికాది కాదు’ అని అన్నారు.
ఇక గల్ఫ్‌లో పరిస్థితులు మరింత ముదిరే అవకాశాన్ని కొట్టిపారేయలేమని కూడా ఆయన హెచ్చరించారు. ‘యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగి ఇరాన్ దిగ్బంధనం తొలగకపోతే ఘర్షణలు హిందూ మహాసముద్రానికీ విస్తరిస్తాయి. బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రంలో కూడా ఘర్షణలు చెలరేగుతాయి’ అని హెచ్చరించారు. అమెరికాకు చెందిన ఇతర సైనిక స్థావరాలను కూడా తాము టార్గెట్ చేస్తామని అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబాతో సమావేశం అయ్యేందుకు తాను సిద్ధమేనని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
ఆస్ట్రేలియా చరిత్రలో మొదటిసారి.. లక్ష బొద్దింకల సీజ్..
పరస్పర దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా