Share News

పరస్పర దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:01 AM

అమెరికా-ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం శనివారం మరింతగా విస్తరించింది. పొరుగున ఉన్న కువైట్‌, బహ్రెయిన్‌లకు పాకడంతో పశ్చిమాసియా దద్దరిల్లింది.

పరస్పర దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా

  • ఇరాన్‌ రాడర్లపై అమెరికా బాంబులు

  • అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులు

టెహ్రాన్‌, జూన్‌ 6: అమెరికా-ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం శనివారం మరింతగా విస్తరించింది. పొరుగున ఉన్న కువైట్‌, బహ్రెయిన్‌లకు పాకడంతో పశ్చిమాసియా దద్దరిల్లింది. తొలుత అమెరికా ఇరాన్‌కు చెందిన నిఘా వ్యవస్థలపై దాడి చేయగా, అందుకు సమాధానంగా ఇరాన్‌...కువైట్‌, బహ్రెయిన్‌లలో ఉన్న అమెరికా స్థావరాలపై ప్రతిదాడి చేసింది. హోర్ముజ్‌ జలసంఽధికి సమీపంలోని గోరుక్‌, కెషమ్‌ దీవుల్లో ఉన్న ఇరాన్‌ రాడార్‌, నిఘా వ్యవస్థలపై అమెరికా దాడి చేసింది. ఆ తరువాత హోర్ముజ్‌ వైపు ఇరాన్‌ ప్రయోగించిన 4డ్రోన్లను కూల్చివేసింది. దాంతో ఇరాన్‌ కువైట్‌, బహ్రెయిన్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించింది. తమ అనుమతులు లేకుండా హర్మోజ్‌ను దాటుతున్నందుకు నాలుగు ట్యాంకర్లపై దాడిచేసింది. ఇరాన్‌ క్షిపణులను మధ్యలోనే కూల్చివేసినట్టు అమెరికా ప్రకటించింది. మరోవైపు శాంతి ఒప్పందం కుదరాలంటే తమ షరతుకు అమెరికా అంగీకరించాలని ఇరాన్‌ తెలిపింది. అమెరికా స్తంభింపజేసిన తమ నిధుల్లో 24 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.2.2లక్షల కోట్లు)ను విడుదల చేయాలని డిమాండు చేసింది. అందులో 12 బిలియన్‌ డాలర్లను తాత్కాలిక ఒప్పందం కుదిరిన వెంటనే ఇవ్వాలని సూచించింది. మిగిలినవి తరువాత ఇవ్వవచ్చని తెలిపింది. అణ్వాయుధాలను కలిగి ఉందన్న కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు ఉన్న 120 బిలియన్‌ డాలర్ల ఆస్తులను అమెరికా స్తంభింపజేసింది.

Updated Date - Jun 07 , 2026 | 06:01 AM