Share News

నేపాల్‌ వరదలు.. టీ బ్రేక్.. 28 మంది ప్రాణాలు కాపాడింది..!

ABN , Publish Date - Aug 30 , 2026 | 04:32 PM

నేపాల్‌ వరదల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 28 మంది యాత్రికులు శనివారం స్వస్థలాలకు చేరుకున్నారు. కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రలో కేవలం పది నిమిషాల ఆలస్యం, ఓ చిన్న టీ విరామం తమ ప్రాణాలను కాపాడాయని వారు వెల్లడించారు.

నేపాల్‌ వరదలు.. టీ బ్రేక్.. 28 మంది ప్రాణాలు కాపాడింది..!
Nepal Floods Tea Break

అమరావతి: నేపాల్‌ వరదల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 28 మంది యాత్రికులు శనివారం స్వస్థలాలకు చేరుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకకు చెందిన పర్యాటకులు ఉన్నారు. కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన ఈ బృందం.. కేవలం పది నిమిషాల ఆలస్యం, ఓ చిన్న టీ విరామం తమ ప్రాణాలను కాపాడాయని వెల్లడించింది. లేకుంటే స్యాబ్రుబేసి వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన వంతెనపైనే తాము ఉండేవాళ్లమని తెలిపింది.


ఈ బృందంలో తిరుపతికి చెందిన సైన్‌ ఇన్‌ ట్రావెల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పెమ్మసాని వెంకటరమణ ఉన్నారు. నేపాల్-టిబెట్ సరిహద్దులోని స్యాబ్రుబేసికి తాము ముందుగానే చేరుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే, టీ తాగేందుకు కాసేపు ఆగామని, ఆ తర్వాత మరో పది నిమిషాలు ఆలస్యం కావడం తమకు కలిసొచ్చిందని చెప్పారు. ఈ లోపే ప్రకృతి విపత్తు సంభవించిందని పేర్కొన్నారు. ఇది గమనించిన తమ డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి మార్గాన్ని మార్చి తమను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడని వెంకటరమణ వివరించారు.


మరోవైపు విశాఖపట్నానికి చెందిన కృష్ణయ్య ముత్యాల.. వీసా ఆలస్యమే తమ ప్రాణాలను కాపాడిందని తెలిపారు. తమ బృందంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు చెందిన 28 మంది ఉన్నారని, మానస సరోవర్‌ యాత్రకు వెళ్లాల్సి ఉండగా వీసాలు రావడం ఆలస్యమైందని చెప్పారు. దీంతో తమ ప్రయాణం మూడు రోజులు ఆలస్యమైందన్నారు. ప్రణాళిక ప్రకారం తమ ప్రయాణం సాగి ఉంటే వరదలు సంభవించిన రోజు స్యాబ్రుబేసి వంతెనపై తాము ఉండేవాళ్లమని చెప్పారు. ఆ సమయంలో వంతెన కొట్టుకుపోవడంతో తమ బృందంలోని వారంతా ప్రాణాలు కోల్పోయి ఉండేవారని భయాందోళన వ్యక్తం చేశారు.


ఇదిలా ఉండగా.. టిబెట్‌ సరిహద్దు వెంబడి నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 750 మంది మృతిచెందగా.. వేల మంది గల్లంతయ్యారు. కాగా, నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక, గాలింపు చర్యలకు భారత్‌ అండగా నిలిచింది. ఆగస్టు 29న 11 మంది సభ్యులతో కూడిన బృందం ఖాఠ్మాండూకి చేరుకోగా.. ఆదివారం మరో ప్రత్యేక విమానం నేపాల్‌కు చేరింది. ఇందులో అత్యవసర మానవతా సహాయ సామగ్రిని ఆ దేశానికి భారత్ పంపించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. అలాగే సాంకేతిక సహకారాన్నీ అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీ హయాంలో శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు: బొండా ఉమా

రాయలసీమ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్

Updated Date - Aug 30 , 2026 | 04:53 PM