Share News

1643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్‌మాస్టర్‌

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:18 AM

బుధవారం ఉదయం 9.20 గంటల సమయం.. నేపాల్‌లోని నువాకోట్‌లో ఉన్న త్రిభువన్‌ త్రిశూలీ సెకండరీ స్కూల్‌లో అప్పుడే పాఠాలు మొదలయ్యాయి. పాఠశాల హెడ్‌మాస్టర్‌...

1643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్‌మాస్టర్‌

  • ప్రమాదాన్ని పసిగట్టి సురక్షిత ప్రాంతానికి

  • విద్యార్థులను తరలించిన రాజేంద్ర దవాదీ

కాఠ్మాండు, ఆగస్టు 30: బుధవారం ఉదయం 9.20 గంటల సమయం.. నేపాల్‌లోని నువాకోట్‌లో ఉన్న త్రిభువన్‌ త్రిశూలీ సెకండరీ స్కూల్‌లో అప్పుడే పాఠాలు మొదలయ్యాయి. పాఠశాల హెడ్‌మాస్టర్‌ రాజేంద్ర దవాదీ క్లాసులను పర్యవేక్షిస్తూ స్కూల్లో తిరుగుతున్నారు. స్కూల్‌లో ఆ సమయంలో 1,643 మంది విద్యార్థులున్నారు. అంతలోనే గ్రామంలో నుంచి ఒక వ్యక్తి భయంతో, ఆయాసంతో రొప్పుతూ పరుగె త్తుకొచ్చాడు. ‘మన గ్రామంపై నది విరుచుకుపడింది. ఊరుమొత్తం నదిలో కొట్టుకుపోయింది. ఎత్తయిన ప్రాంతానికి వెళ్లి ప్రాణాలు కాపాడుకోండి’ అని అరుస్తూ చెప్పాడు. కానీ, నదికి స్కూలు 60మీటర్ల ఎత్తులో ఉండటంతో మొదట రాజేంద్ర భయపడలేదు. అయితే, ఆ పాఠశాలకు సమాంతర ఎత్తులో నదిపై ఉన్న స్టీల్‌ వంతెన కూడా కొట్టుకుపోయిందని ఆ గ్రామస్తుడు చెప్పటంతో నిశ్చేస్టుడయ్యాడు. అంతలోనే తేరుకొని మెరుపు వేగంతో స్పందించి స్కూల్‌ బెల్‌ మోగించాడు. విద్యార్థులందరినీ టీచర్ల సాయంతో కొండపైకి తీసుకువెళ్లాడు. వాళ్లు స్కూలును ఖాళీ చేసిన నిమిషాల వ్యవధిలోనే నది రాకాసిలా స్కూల్‌పై పడింది. చూస్తుండగానే స్కూల్‌ నదిలో కలిసిపోయింది.

21 మంది ప్రాణాలు కాపాడిన చీర

నేపాల్‌ జల విలయం నుంచి తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికులు తృటిలో బయటపడ్డారు. చీర సాయంతో ఎత్తయిన గట్టుపైకి ఎక్కి వీరు ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన తీరును కబీర్‌దాస్‌, ఆయన సతీమణి విజయ మీడియాకు తెలిపారు. ‘కుంభకోణంకు చెందిన ఒక ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా 51మందిమి మానస సరోవర్‌ యాత్రకు వెళ్లాం. బుధవారం ఉదయం నేపాల్‌లోని రసువా నుంచి మూడు బస్సుల్లో టిబెట్‌కు వెళ్తుండగా.. మా బస్సు సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. అదే మా ప్రాణాలు కాపాడింది. డ్రైవర్‌ బస్సును చెక్‌ చేస్తుండగానే పెద్ద బాంబుపేలినంత భారీ శబ్ధంతో పెద్దపెద్ద రాళ్లు, బురదతో కూడిన ప్రవాహం మా బస్సును తాకింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆ నేపాలీ డ్రైవర్‌ మమ్మల్ని వెంటనే బస్సు దిగి కొండపైకి వెళ్లాలని సూచించాడు. అప్పుడు బస్సులో 21 మందిమి ఉన్నాం. అందరం 50 ఏళ్లు పైడినళ్లమే. వెంటనే బస్సు దిగి ఒక కొండపైకి ఎక్కడానికి ప్రయత్నించాం. కానీ, అప్పటికే అక్కడంతా బురద చేరటంతో ఎక్కలేకపోయాం. మా బృందంలోని పూన్‌గుడి అనే మహిళ ఎలాగోలా గట్టుపైకి ఎక్కి తన చీరను కిందికి జారవిడిచింది. దానిని పట్టుకొని అందరం పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాం’ అని వివరించారు. మిగతా రెండు బస్సుల్లో వెళ్లిన వారి జాడ ఇప్పటికీ తెలియలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు మరో జన్మ ఎత్తినట్లుగా ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Aug 31 , 2026 | 06:18 AM