వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్లు.. తీవ్రంగా గాలిస్తున్న నేపాలీ పోలీసులు
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:33 PM
భారీ వరదలు నేపాల్‌లో ఊహించని సమస్యను సృష్టించాయి. వరదల ధాటికి సుమారు 20 బ్యాంకులకు చెందిన లాకర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్ వరదలు సృష్టించిన బీభత్సం పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. అకస్మాత్తుగా వచ్చిన వరదలను ఎదుర్కొనడానికి నేపాల్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం ఓ సమస్య నేపాల్ ప్రభుత్వానికి, పోలీసులకు కంటి మీద కునుకు రాకుండా చేస్తోంది. భారీస్థాయిలో వచ్చిన వరదల వల్ల సుమారు 20 బ్యాంకులకు చెందిన లాకర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ లాకర్లు దుండగుల చేతుల్లోకి చిక్కకుండా వాటిని సురక్షితంగా స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ లాకర్లలో భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
డీఐజీ అబి నారాయణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆకస్మిక వరదల నేపథ్యంలో గల్లంతైన వ్యక్తుల కోసం గాలించడం, వారిని రక్షించి సురక్షిత ప్రాంతాల్లోకి తరలించడానికే పోలీసులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కూడా తమపైనే ఉందని డీఐజీ పేర్కొన్నారు.
రసువా, ధాదింగ్, చిత్వన్ తదితర ప్రాంతాల్లోని పలు బ్యాంకులు వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయని నారాయణ్ తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన లాకర్లలో బంగారం, విలువైన వస్తువుల గల లాకర్లే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. మరికొన్ని లాకర్లు బురద కింద కూరుకుపోయాయని, పోలీసులు వాటిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొట్టుకుపోయిన లాకర్లలో కొన్నిటిని దుండగులు పగులకొట్టి నగదు, బంగారాన్ని దోచుకున్నట్టు గుర్తించామని డీఐజీ నారాయణ్ పేర్కొన్నారు.
ఎగువ రసువా ప్రాంతంలో వరదల్లో కొట్టుకుపోయిన ఓ లాకర్‌ను చేజిక్కించుకున్న దుండగులు 92 లక్షల నేపాలీ రూపాయలను దొంగిలించినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. కానీ, ఆ లాకర్‌లో 1.5 కోట్ల నగదుతో పాటు 50 కోట్ల విలువైన బంగారం ఉండాలని బ్యాంక్ అధికారులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన నగదు, బంగారం ఎలా మాయమయ్యిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, మరో ఘటనలో 'కృషి వికాస్ బ్యాంక్'కు చెందిన లాకర్లను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ నారాయణ్ తెలిపారు.
Also Read:
ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ కోర్టు భారీ ఊరట.. ఇక ఏకాంత నిర్బంధం ఉండదు..
ఏపీ పన్నుల రాబడిలో భారీ వృద్ధి.. ఆగస్టులో 18.05 శాతం పెరిగిన ఆదాయం
తుమ్మిడిహట్టిపై తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల సుదీర్ఘ భేటీ..