తుమ్మిడిహట్టిపై తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల సుదీర్ఘ భేటీ..
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:16 PM
తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
న్యూఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా బ్యారేజీ ఎత్తు, సాంకేతిక అంశాలు, అంతర్రాష్ట్ర సమస్యలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమీక్షించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్లకు పెంచేలా ఆ రాష్ట్రాన్ని ఒప్పించేందుకు తెలంగాణ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించినట్లు తెలిసింది. బ్యారేజీ ఎత్తు పెంపుతో తెలంగాణకు కలిగే ప్రయోజనాలను అధికారులు మహారాష్ట్ర దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్ర నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది. 152 మీటర్ల ప్రతిపాదనకు అంగీకారం కుదరని పరిస్థితుల్లో కనీసం 150 మీటర్ల ఎత్తుకైనా అంగీకరించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది.
తెలంగాణ ప్రతిపాదనలను ఆ రాష్ట్ర అధికారులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు తదుపరి దశలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో బ్యారేజీ ఎత్తుపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట
ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్