ప్రాణాలకు తెగించి 100 రెస్క్యూ మిషన్లు.. నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ సాహసం..
ABN , Publish Date - Sep 01 , 2026 | 09:41 PM
నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది గల్లంతయ్యారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. వారిలో నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి ప్రత్యేకంగా నిలిచారు.
ఖాఠ్మాండూ: నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పెను విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది గల్లంతయ్యారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. అయితే, వారిలో నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి ప్రత్యేకంగా నిలిచారు. ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి సహాయక చర్యలు చేపడుతున్నారు. 41 ఏళ్ల ప్రియా.. వారం రోజుల్లోనే దాదాపు 100 రెస్క్యూ మిషన్లు నిర్వహించి ప్రశంసలు అందుకుంటున్నారు.
హై ఆల్టిట్యూడ్ రెస్క్యూ పైలట్‌గా అనుభవం ఉన్న ప్రియా అధికారి ప్రస్తుతం రసువా జిల్లాలోని వరద ప్రభావిత టిమురే ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అక్కడ దాదాపు 20 హెలికాప్టర్లు బాధితులను తరలిస్తున్నాయి. ఒకేసారి ఐదు, ఆరు హెలికాప్టర్లు ల్యాండ్ కావాల్సి వస్తుండటంతో పైలట్లు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే, వరదల తర్వాత పేరుకుపోయిన బురద కారణంగా ల్యాండింగ్ అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రియా తెలిపారు. 2015లో నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం కంటే ప్రస్తుత పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉన్నాయని ఆమె చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్ బరువును నేల తట్టుకుంటుందో, లేదో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.
దీంతో హెలికాప్టర్ ఇంజిన్ ఆపకుండానే బాధితులను ఎక్కించుకుని వెంటనే అక్కడి నుంచి బయలుదేరాల్సి వస్తోందని ప్రియా చెప్పారు. టిమురేలో తొలి రెండు రోజుల్లోనే 200 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఆకాశం నుంచి మృతదేహాలు, విధ్వంసాన్ని చూడటం తీవ్రంగా కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరుస రెస్క్యూ మిషన్లతో పైలట్లు తీవ్రంగా అలసిపోయినా.. ప్రజలను కాపాడేందుకే తాము శిక్షణ పొందామని ప్రియా అధికారి స్పష్టం చేశారు. దీంతో ఆమె తెగువ గురించి తెలుసుకున్న పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేపాల్ వరదలు.. కళ్లెదుటే బురద నీటిలో భార్య కొట్టుకుపోవడంతో..
అసదుద్దీన్ ఒవైసీకి షాక్..!.. పక్క చూపులు చూస్తున్న ఏఐఎంఐఎం సీనియర్ నేత..