రోజుకు 5 నిమిషాలే పని.. నెలకు రూ.9 లక్షల మనీ.. చిన్న ఆలోచనతో లక్షల కోట్లు ఆయన సొంతం
ABN , Publish Date - Sep 01 , 2026 | 08:41 PM
అరవింద సమేత చిత్రంలో 5 రూపాయల కారణంగా ఎంత హింస జరిగిందో అందరికి తెలుసు. అయితే ఈ కథలో 5 నిమిషాలు వల్ల ఓ వ్యక్తి మహా కుబేరుడిగా మారారు. ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయలను ఆయన సంపాదించేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రోజుకు 5 నిమిషాలే పని చేయాలి.. నెలకు 10 వేల డాలర్లు ( దాదాపు 9 లక్షల రూపాయలు) సంపాదించాలి. ఇది కొంచెం అతిగా అనిపిస్తోందా.. కానీ ఓ వ్యక్తి ఇది సాధ్యమని భావించారు. ప్రతిరోజూ 5 నిమిషాల పనితో నెలకు లక్షలు గడించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆయనను చూసి తోటి వారే నవ్వుకున్నారు. ఇవేమీ పట్టించుకోని ఆయన డబ్బు సంపాదించడం కోసం రోజులో 5 నిమిషాలు ఆలోచించేవారు. అలా ఓ రోజు ఒక కొత్త పరికరం కనిపెట్టాలన్న ఆలోచన ఆయనకు తట్టింది.
ఆయనే మసయోషి సన్. సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడిగా టెక్నాలజీ రంగానికి ఆయన సుపరిచితులు. 2026 సెప్టెంబరు నాటికి ఆయన సంపద అక్షరాల 5.3 లక్షల కోట్లు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఈ 5 నిమిషాల సవాలును ఆయనకు ఆయనే విసురుకున్నారు. ఇలా నిర్ణీత సమయంలోనే ఓ ఆవిష్కరణ చేయాలని పూనుకున్నారు. మసయోషి.. కొందరు పరిశోధకులు, ప్రొఫెసర్ల సహాయంతో ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌లేటర్ పరికరాన్ని కనిపెట్టారు. ఆ పరికరాన్ని జపాన్‌కు చెందిన ఓ సంస్థకు 1.7 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ విధంగా సన్ ప్రయాణానికి తొలి అడుగు పడింది. ఆ తరువాత ఆయన జపాన్ నుంచి వీడియో గేమ్ యంత్రాలను అమెరికాకు తీసుకొచ్చి రెస్టారెంట్లకు అమ్మేవారు. ఈ వ్యాపారంలో ఆయనకు 1.5 మిలియన్ డాలర్ల లాభం వచ్చింది. 5 నిమిషాల ఆలోచన వచ్చిన 18 నెలల్లోనే 3.2 మిలియన్ డాలర్లు ఆర్జించారు.
పెట్టుబడులే ఆయన ఆయుధం..
జపాన్‌లో ఉంటున్న సన్‌కు అమెరికా వెళ్లాలని ఓ సన్నిహితుడు సలహా ఇచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని, కంప్యూటర్లపై పట్టు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. దీంతో అమెరికా వచ్చిన సన్.. కంప్యూటర్లు, టెక్నాలజీపై సమగ్ర అవగాహన సంపాదించారు. చదువు పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ పంపిణీ వ్యవస్థ సాఫ్ట్‌బ్యాంక్‌ను స్థాపించారు. అయితే ఆయన అంచెలంచెలుగా ఎదగడానికి మాత్రం పెట్టుబడులే ఉపయోగపడ్డాయి. ఇంటర్నెట్ ప్రారంభ దశలోనే ఆయన టెక్ కంపెనీలపై శ్రద్ధ పెట్టి, వాటిల్లో పెట్టుబడులు పెట్టారు. 2000 సంవత్సరంలో ఓ చిన్న సంస్థ అయిన అలీబాబాలో సన్ 20 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఆ సంస్థకు కోట్లలో లాభాలు రావడంతో ఆయన జీవితమే మారిపోయింది.
చిన్న తప్పు.. పెద్ద ముప్పు
అయితే పెట్టుబడుల్లో దూసుకుపోతున్న సన్‌కు 2019లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తను భారీగా పెట్టుబడి పెట్టిన ఓ సంస్థ దివాళ తీయడంతో ఆయనకు వేల కోట్ల నష్టాలొచ్చాయి. దీంతో పెద్ద పాఠమే నేర్చుకున్న సన్.. పెట్టుబడుల తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు.
ఏఐపై దృష్టి..
ప్రస్తుతం సన్ తన దృష్టినంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే కేంద్రీకరించారు. 2026 మార్చి 31 నాటికి సాఫ్ట్‌బ్యాంక్ ఓపెన్ఏఐలో 34.6 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. 2025లో సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్‌ఏఐ, ఒరాకిల్, ఎంజీఎక్స్ కలిసి ‘స్టార్‌గేట్’ ప్రాజెక్టును ప్రారంభించాయి. అమెరికాలో ఏఐ మౌలిక వసతులపై నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలన్నది ఈ ప్రాజెక్టు టార్గెట్. దీనికి సన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read:
అసదుద్దీన్ ఒవైసీకి షాక్..!.. పక్క చూపులు చూస్తున్న ఏఐఎంఐఎం సీనియర్ నేత..
వాద్‌నగర్ నుంచి వారణాసి వరకు.. ప్రధాని మోదీ బర్త్‌డేకు బీజేపీ భారీ ప్లాన్..
రాణించిన వైభవ్, ఇషాన్.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ఈస్ట్ జోన్