నేపాల్‌ను వణికిస్తున్న వర్షాలు.. ప్రమాదకర స్థాయిలో నదుల ప్రవాహం
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:24 PM
నేపాల్‌లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ఖాట్మండు, సెప్టెంబర్ 02: నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదుల్లోని నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరాయి. దీంతో వివిధ ప్రాంతల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేపాల్ ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా దేశంలోని మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశాయి. ఈ రోజు ఉదయం సింధూలి జిల్లాలోని సన్ కోషి, గూర్ఖాలోని బుధి గండకి, దడెల్దురాలోని మహాకాళి నదుల్లో నీరు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని నేపాల్ జలవిజ్ఞాన, వాతావరణ, వరద అంచనా విభాగం వెల్లడించింది.
అలాగే లామ్‌జుంగ్ జిల్లాలోని మార్సాంగ్డి, భుకుండేబేసి నీటిమట్టం పర్యవేక్షణ కేంద్రంలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటిందని వివరించింది. ఈ నదుల్లో నీటి మట్టం పెరగడం వల్ల వరద ముప్పునకు ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
నేపాల్‌లో రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయి. దాంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మరో వైపు నేపాల్‌లో మెరుపు వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.