Share News

నేపాల్‌కు మరో వరద ముప్పు.. తాత్కాలిక సరస్సు నుంచి లీకవుతున్న నీరు..

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:58 PM

నేపాల్‌ను వరద ముప్పు మరోసారి భయపెడుతోంది. నాలుగు రోజుల కిందట సంభవించిన భారీ ఆకస్మిక వరదల విషాదం నుంచి కోలుకోకముందే మరో ప్రమాదం పొంచి ఉందని చైనా హెచ్చరించింది.

నేపాల్‌కు మరో వరద ముప్పు.. తాత్కాలిక సరస్సు నుంచి లీకవుతున్న నీరు..
Nepal Floods Alert

ఖాఠ్మాండూ: నేపాల్‌ను వరద ముప్పు మరోసారి భయపెడుతోంది. నాలుగు రోజుల కిందట సంభవించిన భారీ ఆకస్మిక వరదల విషాదం నుంచి కోలుకోకముందే మరో ప్రమాదం పొంచి ఉందని చైనా హెచ్చరించింది. లెండే ఖోలా నదీ వ్యవస్థ ఎగువ ప్రాంతంలో హిమనీనదం కూలిపోవడంతో కొండచరియలు, శిథిలాలు అడ్డుకట్టగా తాత్కాలిక సరస్సు ఏర్పడిందని చైనా అధికారులు తెలిపారు. ఈ సరస్సులో నీటి రంగు క్రమంగా ముదురుతోందని.. ఇది అడ్డుకట్ట బలహీనపడుతున్న సంకేతం కావచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు నేపాల్ విదేశాంగ శాఖకు చైనా అధికారులు సమాచారం అందించారు.


చోచెన్ నది, పురేపు నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఏర్పడిన ఈ సరస్సులో శుక్రవారం నాటికి సుమారు 25 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీరు చేరినట్లు చైనా జలవనరుల శాఖ తెలిపింది. మరో మూడు రోజుల్లో అదనంగా 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల వరకు నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే, తాత్కాలిక అడ్డుకట్టలో కొంత భాగం తెగిపోతే గరిష్ఠంగా సెకనుకు 500 క్యూబిక్‌ మీటర్ల నీరు దిగువకు ప్రవహించే అవకాశం ఉందని చైనా వరద నమూనా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ ప్రవాహం నదీ గట్ల పరిధికే పరిమితమవుతుందని, దిగువ ప్రాంతాల్లో నీటి మట్టం స్వల్పంగా పెరగవచ్చని అధికారులు తెలిపారు. భారీ స్థాయిలో నీటి ఉధృతి ఉండే అవకాశం తక్కువగా ఉందని పేర్కొన్నారు.


మరోవైపు, శుక్రవారం నుంచే సరస్సు లీకై లెండే ఖోలా, త్రిశూలీ నదుల్లోకి నీరు ప్రవహించడం ప్రారంభమైంది. ఇప్పటికైతే ఈ ప్రవాహంతో తక్షణ ప్రమాదం లేదని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే అడ్డుకట్ట పూర్తిగా లేదా పాక్షికంగా తెగిపోయే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని అధికారులు చెబుతున్నారు. దీంతో సరస్సు పరిస్థితిని డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలతో నేపాల్‌, టిబెట్‌లో భారీ నష్టం నేపథ్యంలో తాజా హెచ్చరిక ఆందోళనకు గురిచేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

సీఎన్‌జీ ధరలకు మళ్లీ రెక్కలు.. కిలోకు రూ.3.89 పెంపు..

నేపాల్ వరదలు.. రోజుల తర్వాత దొరికిన చనిపోయారని అనుకున్న చిన్నారులు..

Updated Date - Aug 29 , 2026 | 01:21 PM