Share News

74 దేశాల్లో మైక్రోసాఫ్ట్‌ సేవలకు బ్రేక్‌!

ABN , Publish Date - Nov 14 , 2026 | 03:48 AM

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ సేవల్లో తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది.

74 దేశాల్లో మైక్రోసాఫ్ట్‌ సేవలకు బ్రేక్‌!
microsoft

  • సాంకేతిక సమస్యతో స్తంభించిపోయిన ఔట్‌లుక్‌, టీమ్‌, ఆఫీస్‌ 365, ఇతర అప్లికేషన్లు

  • ప్రపంచవ్యాప్తంగాప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై ప్రభావం

హాంగ్‌కాంగ్‌, నవంబరు 13: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ సేవల్లో తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐటీ సహా పలు రంగాల కంపెనీలు ఎక్కువగా వినియోగించే ఔట్‌లుక్‌, మైక్రోసాఫ్ట్‌ 365, టీమ్స్‌ సహా పలు అప్లికేషన్లు అందుబాటులో లేకపోవడంతో వేలాది సంస్థ లు, కార్యాలయాలు, ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. గురువారం సాయంత్రం ప్రారంభమైన ఈ అంతరాయం శుక్రవారం కూడా కొనసాగింది. ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లో వినియోగదారులకు ఈ సమస్యలు తలెత్తాయి. అయితే ఈ సమస్యలకు సైబర్‌ దాడి వంటివేమీ కారణం కాదని.. అంతర్గత సాంకేతిక ప్రక్రియలో తలెత్తిన లోపాలు, సర్వర్ల కాన్ఫిగరేషన్‌లో చేసిన మార్పులే సమస్యకు దారితీశాయని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ప్రకటించింది. కొన్ని సర్వర్లపై అసాధారణ స్థాయిలో భారం పెరగడంతో స్తంభించిపోయాయని, దానితో డేటా ట్రాఫిక్‌ను ఇతర సర్వర్లకు మళ్లించాల్సి వచ్చిందని తెలిపింది. ఈ క్రమంలో మిగతాసర్వర్లపైనా ఒత్తిడి పెరిగి సమస్య విస్తరించిందని వివరించింది. కొన్ని సర్వర్లను పునరుద్ధరించి నా భారీగా డేటా ట్రా ఫిక్‌ రావడంతో మళ్లీ స్తంభించిపోయినట్టు తెలిపింది. శుక్రవారం రాత్రికల్లా ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో సేవలను కొంతమేర పునరుద్ధరించామని, యూరప్ లోనూ పరిస్థితి మెరుగుపడుతోందని సంస్థ వెల్లడించింది.


కీలక సేవలు స్తంభించడంతో ఇబ్బందులు

మైక్రోసాఫ్ట్‌ కీలక సేవలు పనిచేయకపోవడంతో వివిధ రంగాల్లోని కంపెనీల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ-మెయిల్‌ సేవలకు సంబంధించిన ఔట్‌లుక్‌ పనిచేయకపోవడంతో సందేశాలు పంపడం, స్వీకరించడం, చదవడం సాధ్యం కాకపోవడం, కార్యాలయాల మధ్య సమాచార మార్పిడి నిలిచిపోవడం వంటివి ఇబ్బందిగా మారాయి. టీమ్స్‌ అప్లికేషన్‌ పనిచేయక చాటింగ్‌, ఆన్‌లైన్‌ సమావేశాలు, కార్యాలయా ల మధ్య సమాచార మార్పిడికి ఆటంకం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌ వంటి అప్లికేషన్ల ఆన్‌లైన్‌ సేవలు, వన్‌డ్రైవ్‌ క్లౌడ్‌ నిల్వ, షేర్‌పాయింట్‌ ద్వారా డాక్యుమెంట్ల షేరింగ్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కోపైలట్‌ సేవలపైనా ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్‌ సేవలపై ఆధారపడే ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ సంస్థల కనెక్టర్లపైనా ప్రభావం పడినట్లు సమాచారం. బ్రిటన్‌లో నేషనల్‌ హెల్త్‌ సర్వీసు సేవలు, పలు పోలీసు విభాగాల్లో ఫిర్యాదుల స్వీకరణ, నార్వేలో పలు మంత్రిత్వ శాఖల్లో, సింగపూర్‌ ప్రభుత్వ ఈ-మెయిల్‌ వ్యవస్థ, ఫిలిప్పీన్స్‌లో సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రభావితమైనట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి.

ఢిల్లీలో 3 స్పైస్‌జెట్‌ విమానాలు రద్దు

మైక్రోసాఫ్ట్‌ సేవల అంతరాయం ప్రభావం భారత్‌లోనూ పలు రంగాలను తాకింది. ఢిల్లీ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరాల్సిన స్పైస్‌జెట్‌కు చెందిన మూడు విమానాలను రద్దు చేశారు. మరో రెండు విమానాలు ఆలస్యమయ్యాయి. ఎయిరిండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్‌ సంస్థలు తమ విమాన కార్యకలాపాలకు అంతరాయం కలగలేదని ప్రకటించినా.. ప్రయాణికులకు సమాచారం అందించే క్రమంలో ఇబ్బందులు తలెత్తాయని, ఈ-మెయిల్‌ కాకుండా ఇతర వ్యవస్థల ద్వారా సంప్రదింపులు జరపాలని ప్రయాణికులకు సూచించాయి.


క్లౌడ్‌ విధానంపై ఆధారపడటంతో ఇబ్బంది

ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు కార్యాలయాల నిర్వహణలో మైక్రోసాఫ్ట్‌ 365పై ఆధారపడుతున్నాయి. ఈ-మెయిల్‌ సేవల నుంచి సమావేశాల నిర్వహణ, డాక్యుమెంట్ల తయారీ, సమాచార భద్రత, డేటా నిల్వ వరకు అనేక కార్యకలాపాలు ఒకే సాంకేతిక వేదికపై ఆధారపడి సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సర్వీస్‌ ప్రొవైడర్‌ వద్ద తలెత్తిన సమస్య అనేక రంగాల కార్యకలాపాలను ఏకకాలంలో దెబ్బతీస్తోందని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇది గొలుసుకట్టు తరహాలో ఆయా సంస్థల సేవలపై ఆధారపడిన ఇతర కంపెనీలపైనా ప్రభావం చూపిస్తోందని అంటున్నారు

ఇవి కూాడా చదవండి..

విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!

అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి

Updated Date - Nov 14 , 2026 | 03:49 AM