Share News

విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!

ABN , Publish Date - Nov 13 , 2026 | 06:00 PM

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో నమోదైన ఒక విచిత్రట్రాఫిక్ చలానా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. పరిమితి స్పీడ్ కంటే.. ఒక కిలోమీటర్ వేగం ఎక్కువైందని ఓ వాహనదారుడికి రూ. 2,000 జరిమానా పడింది.

 విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!
Yamuna Expressway

ఇంటర్నెట్ డెస్క్: యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో నమోదైన ఒక విచిత్ర ట్రాఫిక్ చలానా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. పరిమితి స్పీడ్ కంటే.. ఒక కిలోమీటర్ వేగం ఎక్కువైందని ఓ వాహనదారుడికి రూ. 2,000 జరిమానా పడింది. ఈ విచిత్ర అనుభవం అనుజీత్ శివమ్ అనే వ్యక్తి ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తుండగా ఎదురైంది. అక్కడ గరిష్ఠ వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్లు కాగా.. ఆయన వాహనం 101 కి.మీ. వేగంతో వెళ్తున్నట్లు కెమెరా రికార్డు చేసింది.


తన వాహనానికి విధించిన జరిమానాపై సదరు వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు. 'కేవలం 1 కి.మీ. వేగం ఎక్కువైనందుకే జరిమానా?' అంటూ అతడు ఎక్స్‌ ఖాతాలో చలానా కాపీని షేర్ చేశాడు. అయితే ఇక్కడే అసలు ఓ ట్విస్ట్ బయటపడింది. ఆ స్పీడ్ కెమెరా జనరేట్ చేసిన చలానాలో వాహనదారుడి లొకేషన్ భూమిపై కాకుండా, ఏకంగా అట్లాంటిక్ మహాసముద్రంలోని '0°N, 0°E' వద్ద ఉన్నట్లు చూపింది. ఈ ఘటనపై స్పందించిన నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఈ-చలానా హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏఐ కెమెరాలకు ఆలోచన ఉండదని, కేవలం మెషిన్ రీడింగ్ ఆధారంగా ఇలాంటి ఇలాంటి చలానాలు విధిస్తున్నాయని మండిపడుతున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం వేగంలో ఐదు శాతం వరకు మినహాయింపు (టాలరెన్స్) ఉండాలని, కేవలం 1 కి.మీ. తేడాకు ఫైన్ వేయడం చట్ట నిబంధనలకు విరుద్ధమని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఎక్స్‌ప్రెస్‌వేలపై గరిష్ఠవేగ పరిమితులను పెంచాలని, సాంకేతిక లోపాలతో ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తున్న ఏఐ కెమెరాలపై ట్రాఫిక్ శాఖ దృష్టి పెట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ!

Updated Date - Nov 13 , 2026 | 06:08 PM