తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:35 PM
యాదాద్రి జిల్లాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్రకు వెళ్తున్న సమయంలో కాన్వాయ్‌ను లారీ ఢీ కొట్టింది. వివరాల్లోకి వెళితే..
యాదాద్రి, నవంబర్ 13: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్రలో కాన్వాయ్‌కి జరిగిన ప్రమాదం.. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మోత్కూరు మండలం అనాజిపురం సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ కాన్వాయ్‌లోని కారును ఢీకొట్టడంతో వాహనం అదుపుతప్పి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. ఢీకొట్టిన తీవ్రతకు మల్లన్నకు చెందిన ఫార్చునర్ కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మేడబోయిన చందన (23) అనే మహిళ మృతి చెందగా, ఆమె భర్త సాయినాథ్ పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ప్రమాదంలో దంపతుల కుమారుడితో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. ప్రమాద సమయంలో మల్లన్న కారులో లేకుండా కాలినడకన ముందుకు సాగుతుండటంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. లారీ వేగం, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి
మహారాష్ట్రలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..
ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన