అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:17 PM
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కాజీరంగ సమీపంలోని రోంగాజన్ వద్ద ట్రక్కు, మినీబస్సు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని కాజీరంగ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోంగాజన్ ప్రాంతంలో ట్రక్కు, మినీబస్సు బలంగా ఢీకొన్న ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బోకాఖత్ నుంచి నాగావ్కు ప్రయాణికులతో వెళ్తున్న మినీబస్సును ఎదురుగా వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో 16 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తున్నా... అధికారికంగా ఇప్పటిదాకా ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
మినీబస్సు పూర్తిగా ధ్వంసమై.. పలువురు ప్రయాణికులు వాహనంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితి భీతావహంగా మారగా, ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది.
ఈ ప్రమాదంపై గోలాఘాట్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వప్ననీల్ దేకా స్పందిస్తూ.. తొలుత ఏడుగురు మరణించినట్లు సమాచారం అందిందని.. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గాయపడిన వారిని వెంటనే కోహోరా మోడల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, కాజీరంగ జాతీయ పార్కు సమీపంలో అమలులో ఉన్న వేగ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించి మినీబస్సు అధిక వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహారాష్ట్రలో రన్వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..
ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన