Snowstorm Crash: భారీ మంచు తుఫాను.. వందకి పైగా వాహనాలు ఢీ
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:20 AM
అమెరికాను మంచు తుఫాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. హైవేలపై వాహనాలు జారిపోతూ.. ఒకదానిని మరొకటి ఢీకొంటున్నాయి. మిచిగాన్ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కారణంగా వందకు పైగా కార్లు, ట్రక్కులు ఢీకొన్నాయి.
అమెరికా, జనవరి 20: అమెరికాలో మంచు తుఫాను తీవ్ర స్థాయికి చేరింది. మిచిగాన్ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఇంటర్‌స్టేట్ హైవే మీద గ్రాండ్ రాపిడ్స్ సమీపంలోని హడ్సన్‌విల్లే ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం(జనవరి 19) ఉదయం 100కి పైగా వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో డజన్ల కొద్దీ వాహనదారులు గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదు.
మిచిగాన్ స్టేట్ పోలీసుల ప్రకారం.. గ్రేట్ లేక్స్ నుంచి వచ్చిన లేక్-ఎఫెక్ట్ స్నో(మంచు) కారణంగా రోడ్డు పూర్తిగా హిమంతో కప్పిఉండటంతో ముందున్న వాహనాలు కనిపించకుండా పోయాయి. దీనికి బలమైన మంచు గాలులు తోడవడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో వాహనాలు మంచులో జారిపోయి ఒకదానిని మరొకటి ఢీకొట్టాయి.
రహదారి మీద ట్రక్కులు, కార్లు సహా అనేక వాహనాలు గుమిగూడి ఉన్న దృశ్యాలు కనిపించాయి. మంచు తుఫాను బారినపడిన వాహనదారలను హడ్సన్ విల్లే హైస్కూల్‌కు తరలించి సహాయం అందించారు. హైవే రెండు వైపులా మూసివేసి వాహనాలను క్లియర్ చేశారు. సాయంత్రం 6 గంటల సమయానికి రోడ్డుపై వాహనాలను అనుమతించారు.
కాగా.. అమెరికా వ్యాప్తంగా మంచు తుఫాను కొనసాగుతోంది. నార్తర్న్ మిన్నెసోటా నుంచి విస్కాన్సిన్, ఇండియానా, ఒహియో, పెన్సిల్వేనియా, న్యూయార్క్ వరకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. అనేక ప్రాంతాల్లో భారీ మంచు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు అక్కడి అధికారులు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్, నార్త్-సెంట్రల్ ఫ్లోరిడా, సౌత్‌ఈస్ట్ జార్జియాలో కూడా మంచు కురిసింది. చికాగో, మసాచుసెట్స్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉండటంతో క్రీడలకూ అంతరాయం ఏర్పడింది.
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఇంకా మంచు తుఫాను తీవ్రంగా కొనసాగుతుండటంతో ప్రజలు అత్యవసర ప్రయాణాలు మినహా బయటకురావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి
Read Latest Telangana News and National News