పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కమాండర్ అనుమానాస్పద మృతి..
ABN , Publish Date - Aug 09 , 2026 | 06:30 PM
పాకిస్థాన్‌లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్‌లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మరణించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్‌లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మరణించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అతడి మరణానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు (Lashkar Commander Death).
ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లే ముందు అబ్దుల్ అజీజ్ ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసినట్లు సమాచారం. అనంతరం ఇస్లామాబాద్‌లోని ఖుబా మసీదుకు చేరుకున్న ఆయన.. ప్రవేశ ద్వారం వద్ద అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ఏం జరిగిందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. విషప్రయోగం జరిగిందా, అనారోగ్యంతో మరణించాడా లేదా మరేదైనా కారణమా అన్నది అధికారికంగా వెల్లడికాలేదు (Lashkar-e-Taiba Pakistan).
అబ్దుల్ అజీజ్ లష్కరే తోయిబాలో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. జమ్ము, కశ్మీర్‌లో ప్రవేశించే ఉగ్రవాదులకు సేఫ్‌హౌస్‌లు, ఆర్థిక సహాయం, తప్పుడు పత్రాలు సమకూర్చడం వంటివి చేస్తుంటాడు. నీలమ్ వ్యాలీ, ముజఫరాబాద్ మీదుగా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపుతుంటాడు. అలాగే ఎన్‌కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా సంస్థ తరఫున చేస్తుంటాడు (Pakistan Terrorist Deaths).
కాగా, ఇటీవలె లష్కరే తోయిబాకు చెందిన కీలక నేత రిజ్వాన్ హనీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు (Unknown Gunmen Pakistan). గత మూడేళ్లలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో లష్కరే తోయిబాకు చెందిన 30 మందికి పైగా సభ్యులు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమైనట్లు వెల్లడించాడు. ఈ హత్యలకు భారత నిఘా వర్గాలే కారణమని హనీఫ్ ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలను భారత్ ఖండించింది.
ఇవి కూడా చదవండి..
మక్కా ఒప్పందంలో చేరనున్న ఈజిప్ట్.. టర్కీ కీలక ప్రకటన..
సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన..