కాక్‌పిట్‌లో కత్తిపోట్లు
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:19 AM
యూఏఈలోని దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు ప్రయాణిస్తున్న ఫ్లై దుబాయ్ విమానం.. 33వేల అడుగుల ఎత్తులో వెళుతుండగా ఒక్కసారిగా కలకలం.. కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య ఘర్షణ.. గట్టిగా అరుపులు.. పైలట్‌ను కో-పైలట్ కత్తితో పొడిచాడు..

విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్ కుట్ర.. అడ్డుకున్న ప్రధాన పైలట్
కత్తితో దాడి.. రక్తసిక్తంగా మారిన కాక్‌పిట్.. ఎమర్జెన్సీ, హైజాక్ అంటూ సందేశాలు
కేవలం 29 సెకన్లలో 14 వేల అడుగులు కిందికి జారిపోయిన ఫ్లై దుబాయ్ విమానం
కాక్‌పిట్‌లో అరుపులు విని కో-పైలట్‌ను అడ్డుకున్న విమాన సిబ్బంది, ప్రయాణికులు
ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు ఇతర పైలట్ల సాయంతో సౌదీ విమానాశ్రయంలో ల్యాండింగ్
దాడికి దిగిన కో-పైలట్ ఒమనీ.. పోరాడి అందరినీ రక్షించిన పైలట్ మచ్చార్ భారతీయుడే
ఘటన సమయంలో
విమానంలో 174 మంది ప్రయాణికులు
అందులో 166 మంది ఇజ్రాయెల్ జాతీయులే
మా పౌరుల్ని చంపేందుకే విమానం కూల్చివేతకు యత్నం: నెతన్యాహు
ప్రయాణికులంతా సురక్షితంగా ఇజ్రాయెల్‌కు
దుబాయ్, సెప్టెంబరు 30: యూఏఈలోని దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు ప్రయాణిస్తున్న ఫ్లై దుబాయ్ విమానం.. 33వేల అడుగుల ఎత్తులో వెళుతుండగా ఒక్కసారిగా కలకలం.. కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య ఘర్షణ.. గట్టిగా అరుపులు.. పైలట్‌ను కో-పైలట్ కత్తితో పొడిచాడు.. విమానాన్నికూల్చివేయడానికి ప్రయత్నించాడు.. విమానం తలకిందులుగా కిందకు పడిపోవడం (నోస్ డైవ్) మొదలుపెట్టింది.. ప్రయాణికులంతా సీట్లను పట్టుకుని హాహాకారాలు మొదలుపెట్టారు.. విమానం హైజాక్ అయిందంటూ సంకేతాలు వెళ్లాయి.. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై దాడి తరహాలో ఈ విమానంతో భారీ దాడి జరగవచ్చనే ఆందోళన వ్యక్తమైంది. దీనితో ఇజ్రాయెల్ ఒక్కసారిగా అలర్ట్ అయింది.. యుద్ధ విమానాలను గాల్లోకి లేపింది.. మరోవైపు పడిపోతున్న విమానం కాక్‌పిట్‌లోకి పరుగెత్తిన విమాన సిబ్బంది, కొందరు ప్రయాణికులు.. కో-పైలట్‌ను అడ్డుకుని, బంధించారు. ప్రధాన పైలట్, ఇతర సిబ్బంది కలిసి విమానాన్ని అదుపులోకి తెచ్చారు.. తర్వాత కాసేపు అసాధారణంగా చక్కర్లు కొట్టిన విమానం.. సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిన కో-పైలట్‌ను ఒమన్ జాతీయుడిగా గుర్తించారు. విమానాన్ని, ప్రయాణికులను రక్షించిన ప్రధాన పైలట్ భారత్‌కు చెందిన స్మిత్ మఛార్ కావడం గమనార్హం.
174 మంది ప్రయాణికులు..
ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన ఎఫ్‌జెడ్1073 విమానం(బోయింగ్ 737 మ్యాక్స్ 8 మోడల్) బుధవారం ఉదయం దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు బయలుదేరింది. అందులో 27 మంది పిల్లలు సహా 174 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 166 మంది ఇజ్రాయెల్ పౌరులే. సుమారు రెండున్నర గంటల ప్రయాణం అనంతరం ఉదయం 8.45గంటల వేళ విమానం అసాధారణంగా కిందకు పడిపోయింది. ఆ సమయంలో సౌదీ అరేబియా గగనతలంపై ఉండటంతో సమీపంలోని తబుక్ ఎయిర్‌పోర్టుకు అత్యవసర పరిస్థితి(కోడ్ 7700) అంటూ సందేశం వచ్చింది. మరికొన్ని నిమిషాల్లోనే హైజాక్ (కోడ్ 7500) అంటూ సందేశం అందింది. ఈ హైజాక్ సందేశంతోనే తీవ్ర కలకలం చెలరేగింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి జరుగుతుందనే అంచనాలు వెలువడ్డాయి. అందులోనూ విమానంలోని ప్రయాణికుల్లో చాలా వరకు ఇజ్రాయెల్ పౌరులే. దీనితో వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి కాట్జ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు. హైజాక్ అయిన ఫ్లైదుబాయ్ విమానాన్ని పేల్చేస్తారా అన్న వార్తలూ వెలువడ్డాయి. మరోవైపు పైలట్‌పై కత్తితో దాడి చేసి, విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించిన కో-పైలట్‌ను విమాన సిబ్బంది, ప్రయాణికులు కలిసి పట్టుకుని బంధించారు. తీవ్రగాయాలైన పైలట్‌కు విమానంలోనే ఉన్న ఒక వైద్యుడు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు ఇతర విమాన పైలట్ల సాయంతో విమానాన్ని మళ్లించారు. ఈ సమయంలో కోడ్‌ను హైజాక్ నుంచి తిరిగి సాధారణ అత్యవసర పరిస్థితి (7700)కి మార్చారు. సమీపంలోని తబుక్ విమానాశ్రయాన్ని సంప్రదించి, విమానాన్ని ల్యాండ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, పైలట్లు గాయపడ్డారని ఫ్లైదుబాయ్ సంస్థ ప్రకటించింది.
ఆ కాసేపు.. ప్రాణాలపై ఆశలు వదిలేసుకుని..
విమానం ఒక్కసారిగా కిందకు పడిపోతున్న సమయంలో అందులోని ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. సీట్లను గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, కేకలు వేశారు. దీనికి సంబంధించి ప్రయాణికులు ఫోన్లలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ కొంతసేపు తాము ఇక చనిపోయినట్టే అనుకున్నామని ప్రయాణికులు పేర్కొనడం గమనార్హం.
మరో విమానాన్ని పంపినా..
కూల్చివేత ప్రయత్నం జరిగిన విమానం సౌదీలోని తబుక్‌లో ల్యాండ్ అయిన నేపథ్యంలో.. అందులోని ప్రయాణికులను ఇజ్రాయెల్‌కు చేర్చేందుకు ఫ్లైదుబాయ్ సంస్థ మరో విమానాన్ని తబుక్‌కు పంపింది. కానీ మళ్లీ ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణించడానికి కొందరు ప్రయాణికులు నిరాకరించారు. దీనితో తమ దేశపౌరులను తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్ సైనిక రవాణా విమానాలను పంపుతామని సౌదీని కోరింది. దీనికి సౌదీ నిరాకరించడంతో.. ఇజ్రాయెల్ అధికారులు ప్రయాణికులతో మాట్లాడి, ఫ్లైదుబాయ్ విమానంలో ఇజ్రాయెల్‌కు వచ్చేలా ఒప్పించారు. మొత్తం అందరు ప్రయాణికులతో ఆ విమానం ఇజ్రాయెల్‌లోని బెన్‌గురియన్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ ప్రయాణికులకు నెతన్యాహు స్వయంగా స్వాగతం పలికారు.
ఒమన్ కో-పైలట్ ఎలా వచ్చాడు?
పైలట్‌పై దాడికి పాల్పడి విమానాన్ని కూల్చేసేందుకు ప్రయత్నించిన ఒమన్ కో-పైలట్ అంశంలో ఎన్నో సందేహాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్-ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు లేవు. పైగా అరబ్/గల్ఫ్ దేశాల నుంచి ఇజ్రాయెల్‌వైపు వచ్చే విమానాలపై కఠినమైన పరిశీలన ఉంటుంది. అలాంటిది ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలో పైలట్‌గా ఒమన్ జాతీయుడిని ఎలా అనుమతించారని ఇజ్రాయెల్ రవాణా మంత్రి మిరి రెగవ్ సందేహాలు వ్యక్తం చేశారు. విమానాన్ని కూల్చడానికి ముందే ప్రణాళిక ఉండవచ్చన్నారు. అయితే ఒమన్ పైలట్ అసలు ఉద్దేశం ఏమిటి? ముందే ప్రణాళిక వేసుకుని దాడికి ప్రయత్నించాడా అన్న అంశాలపై స్పష్టత రాలేదు.
29 సెకన్లలో..నాలుగు కిలోమీటర్లు కిందకు..
31 వేల అడుగులో ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం కేవలం 29 సెకన్లలో ఏకంగా 17 వేల అడుగులకు పడిపోయిందని విమానాల ట్రాకింగ్ సంస్థ ’ఫ్లైట్ రాడార్24’ వెల్లడించింది. ఆ సమయంలో 14 వేల అడుగుల మేర దాదాపు నిలువుగా (నోస్ డైవ్) కిందకి దిగింది. తర్వాత మళ్లీ 19 వేల అడుగుల ఎత్తుకు చేరి, ప్రయాణమార్గాన్ని మార్చుకుని.. జోర్డాన్ సరిహద్దులకు సమీపంలో అసాధారణ రీతిలో చక్కర్లు కొట్టింది. మళ్లీ వెనక్కి తిరిగి సుమారు గంట తర్వాత సౌదీ అరేబియాలోని తబుక్ ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
మన హీరో పైలట్.. స్మిత్ మచ్చార్!
ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణికులను రక్షించిన పైలట్ స్మిత్ మచ్చార్ భారతీయుడే. గుజరాత్‌కు చెందిన వారని సమాచారం. తనను కత్తితో పొడిచి, విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్ ప్రయత్నిస్తుంటే.. ప్రాణాలకు తెగించి నిలువరించారని స్మిత్ మచ్చార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మన దేశ విమానయాన సంస్థ స్పైస్ జెట్‌లో 11 ఏళ్లపాటు పనిచేసిన ఆయన.. 2022 జూన్‌లో ఫ్లైదుబాయ్ సంస్థలో పైలట్‌గా చేరారు. ఆయనకు 9,500 గంటలకుపైగా విమానం నడిపిన అనుభవం ఉంది. బోయింగ్ 737 పైలట్లకు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే ఫ్లైదుబాయ్ సంస్థ మాత్రం పైలట్, కో-పైలట్ పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. కాగా, కో-పైలట్ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చార్‌కు సౌదీలోని ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్
విమానాన్ని కూల్చేందుకు పైలట్ ప్రయత్నించాడా..