37 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన ఖమేనీ.. ట్రంప్ వల్లేనా..?
ABN , Publish Date - Feb 09 , 2026 | 08:10 PM
ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భయపడ్డారా? ఆ భయంతోనే 37 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదికలో పేర్కొన్న అంశాలు..
టెహ్రాన్, ఫిబ్రవరి 09: ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భయపడ్డారా? ఆ భయంతోనే 37 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదికలో పేర్కొన్న అంశాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన యుద్ధ నౌకలు ఇరాన్‌కు చేరువవుతున్నాయి. దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. ఫిబ్రవరి 8వ తేదీన వైమానిక దళ కమాండర్లతో జరగనున్న వార్షిక సమావేశాన్ని ఖమేనీ రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
1989లో ఖమేనీ నాయకత్వం వహించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వైమానిక దళ కమాండర్లతో జరిగే వార్షిక సమావేశానికి హాజరవుతూ వస్తున్నారు. కోవిడ్ 19 వ్యాప్తి సమయంలోనూ ఈ వార్షిక సమావేశానికి ఖమేనీ హాజరయ్యారు. కానీ, 37 ఏళ్ల తరువాత తొలిసారి ఆయన ఈ సమావేశాన్ని రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఈ వార్షిక సమావేశం ఫిబ్రవరి 8, 1979 పహ్లవి రాజవంశాన్ని పడగొట్టిన నేపథ్యంలో వైమానిక దళ అధికారుల బృందం ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపకులు రుహోల్లా ఖొమేనీకి విధేయత చూపుతూ ప్రతిజ్ఞ చేసిన సందర్భాన్ని సూచిస్తుంది. అలా.. నాటి నుంచి నేటి వరకు ఏటా ఫిబ్రవరి 8వ తేదీన ఈ వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఖొమేనీ.. ఖమేనీ కంటే ముందున్న సుప్రీం లీడర్.
ప్రతి ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహించే ఈ వార్షిక సమావేశంలో వైమానిక దళ సిబ్బంది, కమాండర్లు ఇరాన్ మతాధికారులను కలుస్తుంటారు. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీకి బదులుగా సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి ఆదివారం ఆర్మీ వైమానిక దళ కమాండర్లతో సమావేశం అయినట్లుగా ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదికలో పేర్కొన్నారు.
అమెరికాతో ఉద్రిక్తత..
టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ వార్షిక సమావేశానికి ఖమేనీ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైన్యాన్ని విస్తరింపజేయడంతో ఇరాన్‌పై దాడి చేయడం ఖాయం అనే అభిప్రాయాలు మరింత బలపడ్డాయి. యూఎస్ బెదిరింపుల నేపథ్యంలో ఖమేనీకి ఎలాంటి హానీ జరగకుండా ఉండేందుకు, భద్రతా పరమైన వ్యూహాలలో నిమగ్నమై ఉండటంవలన ఆయన ఈ వార్షిక సమావేశానికి హాజరు కాలేదనే చర్చ జరుగుతోంది.
ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే మధ్యప్రాచ్యం అంతటా విస్తృత సంఘర్షణకు దారితీస్తుందని టెహ్రాన్ అనేకసార్లు హెచ్చరించింది. ‘ఈసారి అమెరికా యుద్ధాన్ని ప్రారంభిస్తే.. అది మధ్యప్రాచ్యం అంతటా వ్యాపిస్తుంది.’ అని ఖమేనీ చాలా సందర్భాల్లో హెచ్చరించారు. 2025 జూన్ మధ్యలో జరిగిన 12 రోజుల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.
కాల్పుల విరమణ తర్వాత జరిగిన చర్చలలో ఇరాన్ అణు కార్యకలాపాల అంశాన్ని చేర్చాలని వాషింగ్టన్ పట్టుబట్టడంపై ఇరాన్ విభేదించింది. ఈ అంశం ఇరు దేశాల మధ్య సంఘర్షణకు కారణమైంది. వైమానిక దాడుల పరస్పర బెదిరింపులకు దారి తీసింది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌పై దాడి చేయడానికి సిద్ధమైనట్లు ప్రచారం జోరుగా సాగింది.
ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య జనవరి చివరిలో అమెరికా తన విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్‌ను అరేబియా సముద్రానికి పంపింది. గత వారం, జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి వైమానిక స్థావరానికి భారీ సంఖ్యలో F-15 యుద్ధ విమానాలు, ఒక MQ-9 రీపర్ ఫైటర్ డ్రోన్, పెద్ద సంఖ్యలో A-10C థండర్‌బోల్ట్ II గ్రౌండ్ అటాక్ విమానాలు చేరుకున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
అలాగే, గైడెడ్-క్షిపణి విధ్వంసక నౌక USS డెల్బర్ట్ D బ్లాక్ ఈజిప్టులోని సూయజ్ కాలువ గుండా మధ్యధరా నుంచి ఎర్ర సముద్రం వరకు ప్రయాణిస్తున్నట్లు, యూఎస్ నేవీ MQ-4C ట్రైటాన్ నిఘా డ్రోన్ గల్ఫ్ మీదుగా పనిచేస్తున్నట్లు చూపించే ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించినట్లు బ్రిటిష్ మీడియా తెలిపింది. వీటితో పాటు E-11A కమ్యూనికేషన్ విమానం, P-8 పోసిడాన్, E-3G సెంట్రీ నిఘా విమానాలు కూడా ఈ ప్రాంతంలో మోహరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Also Read:
ఖర్చుకు వెనకాడని యూఎస్ కంపెనీలు! హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రెండు కొత్త వాల్యూ-బేస్డ్ ఫండ్స్
బ్యాంక్ ఖాతాల్లో మర్చిపోయిన డబ్బు ఎలా తిరిగి పొందాలంటే.?