Share News

ఖర్చుకు వెనకాడని యూఎస్ కంపెనీలు! హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్

ABN , Publish Date - Feb 09 , 2026 | 07:25 PM

హెచ్-1బీ వీసా ఫీజులు పెరిగినా అమెరికా కంపెనీలు వెనకడాట్లేదు. ఏఐ రంగానికి చెందిన విదేశీ నిపుణులను హెచ్-1బీ వీసా ద్వారా భారీ ఎత్తున నియమించుకుంటున్నాయి.

ఖర్చుకు వెనకాడని యూఎస్ కంపెనీలు! హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్
H-1b Visa - AI Roles in USA

ఇంటర్నెట్ డెస్క్: భవిష్యత్తు ఏఐదే అని అమెరికా టెక్ కంపెనీలు బలంగా నమ్ముతున్నాయి. భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయి. అంతేకాకుండా, ఈ రంగానికి చెందిన విదేశీ నిపుణులను హెచ్-1బీ వీసాల ద్వారా పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి. వీసా ఫీజులు పెరిగినప్పటికీ అమెరికా టెక్ సంస్థలు అక్కడి కార్మిక శాఖకు వీసా పిటిషన్లు దరఖాస్తు చేసుకుంటున్నాయి. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపీ) సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ యాపిల్ 2025 ఆర్థిక సంవత్సరంలో విదేశీయుల నియామకాల కోసం సమర్పించిన లేబర్ కండీషన్ అప్లికేషన్లలో(ఎల్‌సీఏ) మెజారిటీ ఏఐ సంబంధిత ఉద్యోగాలవే. ఫారినర్ల తరఫున హెచ్-1బీ పిటిషన్‌ల దాఖలకు మునుపు కంపెనీలు ఎల్‌సీఏను దాఖలు చేస్తాయన్న విషయం తెలిసిందే. అమెజాన్ సమర్పించిన 60 శాతం ఎల్‌సీఏ దరఖాస్తులు ఏఐ సంబంధిత ఉద్యోగాల కోసమేనని ఎన్ఎఫ్ఏపీ అధ్యయనంలో తేలింది. మెటా ఎల్‌సీఏ దరఖాస్తుల్లో 58 శాతం, గూగుల్ ఎల్‌సీఏ దరఖాస్తుల్లో 71 శాతం ఏఐ సంబంధిత ఉద్యోగాలవేనని తెలిసింది. ఏఐ రంగంలో నిలదొక్కుకునేందుకూ అమెరికా సంస్థలు విదేశీ నిపుణులపై ఆధారపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.


ఫోర్బ్స్ కథనం ప్రకారం, అమెరికన్ టెక్ కంపెనీలు ఇప్పటికే ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల వీసా ఖర్చుల విషయంలో కూడా వెనకాడట్లేదు. ఖర్చులు తగ్గించుకునేందుకే కంపెనీలు హెచ్-1బీ వీసాదారులకు ఉద్యోగాలు ఇస్తాయన్న విమర్శ ఇకపై చెల్లుబాటు కాదని కూడా విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. 1990-2010 మధ్య కాలంలో అమెరికా ఉత్పాదకతలో 30 శాతం -50 శాతం స్టెమ్ రంగాలకు చెందిన విదేశీ నిపుణులు కారణమని కొందరు ఆర్థికవేత్తలు అంచనావేశారు.

ఏఐ రంగంలో అమెరికా అగ్రగామిగా ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అయితే, వలసలపై ఆయన అమలు చేస్తున్న కఠిన ఆంక్షల కారణంగా అమెరికా వెనకబడే అవకాశం ఉందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Updated Date - Feb 09 , 2026 | 09:12 PM