Share News

అమెరికా కాంగ్రెస్ కమిటీల ఎదుట హాజరుకానున్న ఎన్విడియా మాజీ సీఈవో

ABN , Publish Date - Nov 17 , 2026 | 09:54 PM

చైనా గూఢచారి సంబంధాలు, ఏఐ చిప్‌ల అక్రమ తరలింపు ఆరోపణలపై ఎన్విడియా మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్ డిసెంబర్ 1న అమెరికా కాంగ్రెస్ కమిటీల ఎదుట హాజరు కానున్నారు.

అమెరికా కాంగ్రెస్ కమిటీల ఎదుట హాజరుకానున్న ఎన్విడియా మాజీ సీఈవో
Jensen Huang to Appear Before Congress

వాషింగ్టన్ డీసీ (అమెరికా): అనుమానిత చైనా గూఢచారి ఆలిస్ హువాంగ్‌తో ఉన్న సంబంధాలు, చైనాకు అక్రమంగా ఏఐ చిప్‌ల తరలింపు ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా (Nvidia) మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు అమెరికా చట్టసభల నుంచి పిలుపు వచ్చింది. డిసెంబర్ 1న ఆయన అమెరికా ప్రతినిధుల సభకు (US House) చెందిన విదేశీ వ్యవహారాలు, నిఘా (Intelligence), చైనా సెలెక్ట్ కమిటీల ఎదుట హాజరుకానున్నట్లు ఫాక్స్ న్యూస్ (Fox News) వెల్లడించింది.

కాంగ్రెస్ కమిటీల విచారణ

డిసెంబర్ 1న జెన్సెన్ హువాంగ్‌ను, ఆ మరుసటి రోజు ఎన్విడియా జనరల్ కౌన్సెల్ టిమ్ టెటర్‌ను హౌస్ కమిటీలు విచారించనున్నాయి. అనుమానిత చైనా గూఢచారి ఆలిస్ హువాంగ్‌తో జెన్సెన్ హువాంగ్‌కు ఉన్న సంబంధం చుట్టూ నెలకొన్న వివాదంపై కమిటీలు ప్రధానంగా ప్రశ్నించనున్నాయి. అంతకుముందే, ఎన్విడియా అధునాతన సెమీకండక్టర్ ఎగుమతులపై వాణిజ్య శాఖ పర్యవేక్షణ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ.. జెన్సెన్ హువాంగ్, వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వాంగ్మూలం ఇవ్వాలని అమెరికా సెనేట్ బ్యాంకింగ్ కమిటీ కోరింది. ఇటీవలి నివేదికలు జాతీయ భద్రత, సున్నితమైన అమెరికన్ టెక్నాలజీ రక్షణపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అమెరికన్ ప్రజలకు సమాధానాలు కావాలని సెనేటర్ టిమ్ స్కాట్ 'ఎక్స్' (X) వేదికగా పేర్కొన్నారు.

సింగపూర్ సంస్థ 'మెగాస్పీడ్'పై క్రిమినల్ చర్యలకు అమెరికా సిద్ధం

నిషేధిత ఎన్విడియా సెమీకండక్టర్లను చైనాకు మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగపూర్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ 'మెగాస్పీడ్' (Megaspeed)పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతం అమెరికా న్యాయ శాఖ (Department of Justice) ఈ క్రిమినల్ విచారణకు నేతృత్వం వహిస్తోంది. అప్పటి మెగాస్పీడ్ మాజీ సీఈవో ఆలిస్ హువాంగ్‌కు, జెన్సెన్ హువాంగ్‌కు ఉన్న వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో ఎన్విడియాతో ఆ సంస్థ జరిపిన వ్యాపార లావాదేవీలపై లోతైన పరిశీలన జరుగుతోంది. ఏదైనా నేరపూరిత చర్య జరిగిందని తేలితే చట్టప్రకారం పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని వాణిజ్య, న్యాయ శాఖలు నవంబర్ 16న ఒక ఉమ్మడి ప్రకటనలో హెచ్చరించాయి. (Jensen Huang to Appear Before Congress)


ఇవి కూడా చదవండి:

అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్

ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ

Updated Date - Nov 17 , 2026 | 09:54 PM