ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర? ఇరాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాది అరెస్టు..
ABN , Publish Date - May 23 , 2026 | 11:06 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఐఆర్‌జీసీతో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలక నేతలు మరణించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ కోపంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ (Ivanka Trump) హత్యకు కుట్ర జరిగిందని సమాచారం. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్‌జీసీ) గ్రూపుతో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసీం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఆమెను హతమార్చేందుకు ఈ పథక రచన చేశాడని పేర్కొంది. కానీ, అతడు ప్లాన్ అమలు చేసే లోపే అరెస్టు అయ్యాడని తెలిపింది.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం... 32 ఏళ్ల మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్ సాదీ కొంతకాలం క్రితం తుర్కియేలో అరెస్టు అయ్యాడు. అక్కడి నుంచి అతడ్ని అమెరికాకు తరలించారు. బాఖర్ సాద్‌ని విచారించిన దర్యాప్తు అధికారులు కీలక విషయాలను గుర్తించారు. ఇవాంకా ట్రంప్‌ను చంపుతానని అతడు శపథం చేశాడని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. మహమ్మద్ వద్ద ఇవాంక (Ivanka Trump) కుటుంబం నివసిస్తోన్న ఇంటి బ్లూప్రింట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్లోరిడాలోని ఆమె నివాసం ఫొటోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసినట్లు తెలుస్తోంది.
ఖాసీం సులేమానీ ఇరాన్ మిలిటరీలో అగ్రశ్రేణి కమాండర్. 2020లో ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) విభాగం ఖుద్ ఫోర్స్‌కు కమాండర్‌గా అతడిని అమెరికా హత్య చేసింది. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని మహమ్మద్ బహిరంగంగానే ప్రకటించాడు. 'మీ రాజభవనాలు గానీ, సీక్రెట్ సర్వీస్ గానీ మిమ్మల్ని రక్షించవు' అని ఇవాంకా కుటుంబాన్ని హెచ్చరిస్తూ అరబిక్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఇరాన్-ఇరాక్ ఉగ్రనెట్‌వర్క్‌లో అతడిది కీలకపాత్ర అని అమెరికా అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
నీట్ యూజీ 2026 విద్యార్థులకు అలర్ట్.. రీఫండ్ కోసం వెంటనే ఇలా దరఖాస్తు చేయండి
తెలుగు సమితి, తానా పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు బడి వార్షికోత్సవం