Share News

ఇటలీ స్కూళ్లలో బురఖాను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు..

ABN , Publish Date - Sep 25 , 2026 | 08:19 PM

ఇటలీలోని స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం విధించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ క్యాబినెట్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఇటాలియన్ భాష సరిగా తెలియని విద్యార్థుల సంఖ్యపైనా పరిమితి విధించింది.

ఇటలీ స్కూళ్లలో బురఖాను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు..

ఇంటర్‌నెట్ డెస్క్: ఇటలీలోని స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం విధించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ క్యాబినెట్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఇటాలియన్ భాష సరిగా తెలియని విద్యార్థుల సంఖ్యపైనా పరిమితి విధించింది. ఇటాలియన్ తెలియని విద్యార్థుల సంఖ్య ప్రతి తరగతికి 30 శాతానికి మించకూడదని ఆదేశాల్లో మెలోనీ ప్రభుత్వం పేర్కొంది. ఉత్తర్వులను వెలువరించిన తర్వాత ప్రధాని మెలోనీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అలాగే, క్యాబినెట్ సమావేశం తర్వాత ఓ టీవీ ఇంటర్వ్యూలోనూ ఆమె మాట్లాడారు. భద్రతా కారణాల వల్లే స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం విధించామని ఆమె స్పష్టం చేశారు. ‘బుర్కా ధరించాలని ఒక మహిళ లేదా బాలికను బలవంతం చేస్తే, ఆమె ప్రాథమిక హక్కులను అణచివేసినట్లే’ అని మెలోనీ అన్నారు. కాగా.. స్కూళ్లలో బుర్కాను నిషేధించాలని ఈ ఏడాది జులైలో నేషనల్ ఫ్యూచర్ పార్టీ పిలుపునిచ్చింది.


విద్యార్థుల సంఖ్యపైనా పరిమితి

స్కూళ్లలో బుర్కాపై నిషేధం విధించడంతో పాటు ఇటాలియన్ భాష తెలియని విద్యార్థుల సంఖ్యపైనా మెలోనీ ప్రభుత్వం పరిమితి విధించింది. ఇటాలియన్ తెలియని విద్యార్థుల సంఖ్య ప్రతి తరగతికి 30 శాతం మించకూడదని ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైనా విద్యార్థి ఇటాలియన్ భాష నేర్చుకోకపోతే, అలాంటి స్టూడెంట్ల తల్లిదండ్రులకు ఉచితంగా ఇటాలియన్ పాఠాలు చెప్పిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటికీ తమ దేశ భాష నేర్చుకోకపోతే వెయ్యి యూరోల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఇటాలియన్ భాష నేర్చుకోకపోవడం వల్ల విద్యార్థులు చదువులో వెనుకబడిపోతారని విద్యా శాఖ మంత్రి జుసేప్పే వాల్దితారా అన్నారు. క్యాబినెట్ భేటీ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యార్థి విద్యాభివృద్ధి, అకాడమిక్ విజయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకమన్నారు. ఇటలీలో మొత్తం 34 వేల బడులు ఉన్నాయని, వాటిలో 30 శాతం మందిపైనే విద్యార్థులు విదేశీయులేనని ఆయన వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

జిన్‌పింగ్‌కు ట్రంప్ అరుదైన కానుక.. మూడు అడుగుల బాల్డ్ ఈగల్ శిల్పం బహూకరణ

ఎయిర్‌పోర్టుకు వచ్చి జిన్‌పింగ్‌కు ట్రంప్‌ స్వాగతం

Updated Date - Sep 25 , 2026 | 08:46 PM