Share News

హెజ్‌బొల్లాకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్‌ దాడుల్లో కీలక నేత మృతి

ABN , Publish Date - Mar 02 , 2026 | 05:07 PM

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తుంది. ఇవాళ జరిగిన దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి చెందినట్లు సౌదీ వార్తా సంస్థ అల్ హదత్ పేర్కొంది.

హెజ్‌బొల్లాకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్‌ దాడుల్లో  కీలక నేత  మృతి
Mohammad Raad

లెబనాన్, మార్చి 02: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. లెబనాన్ లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన భీకరవైమానిక దాడుల్లో లెబనాన్‌ పార్లమెంట్‌లోని హెజ్‌బొల్లా బ్లాక్‌ అధిపతి మహ్మద్‌ రాడ్‌ మరణించారు. ఆయన మృతి చెందినట్లు సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వార్త 'అల్ హదత్' పేర్కొంది.


దక్షిణ లెబనాన్‌ ప్రాంతంలోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇవాళ(సోమవారం) ఇజ్రాయెల్‌ రక్షణ దళం (IDF) వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మహ్మద్‌ రాడ్‌ (Mohammad Raad) మృతి చెందారు. ఈ ఉగ్రసంస్థకు చెందిన మరికొందరు ఉన్నతాధికారులు కూడా తమ దాడుల్లో మృతి చెందారని ఐడీఎఫ్‌ తెలిపింది. అయితే వారి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 31 మంది మృతిచెందగా.. 149 మంది గాయపడినట్లు లెబనాన్‌ ప్రకటించింది.


హెజ్‌బొల్లా నేతలు లెబనాన్‌ రక్షణ కంటే ఇరాన్ కోసం ఎక్కువ పని చేశారని, వారి చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఐడీఎఫ్ అధికారి రఫీ హెచ్చరించారు. మొదట హెజ్‌బొల్లా తమపై రాకెట్‌ దాడులకు పాల్పడడం వల్లే ప్రతి దాడులు చేశామని ఆయన తెలిపారు. మరోసారి వారు ఇటువంటి చర్యలకు దిగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా.. లెబనాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, కీలక నేతల కార్యాలయాలపై దాడులు చేపట్టామన్నారు.


హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక విభాగాల్లో కీలక పాత్ర పోషించే రాడ్‌ మృతి ఆ సంస్థకు భారీ నష్టమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హెజ్‌బొల్లా ఆయుధాలను, కమాండ్‌ సెంటర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఈ ‘ఆపరేషన్‌ రోరింగ్‌ లయన్‌’ను వేగవంతం చేసింది. మరిన్ని దాడులు చేయడానికి ముందు దక్షిణ లెబనాన్‌లోని 50 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా అక్కడి ప్రజలకు సూచించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

సౌదీలోని అతిపెద్ద రిఫైనరీపై ఇరాన్ దాడి.. వీడియో వైరల్

హోలీ స్పెషల్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

Updated Date - Mar 02 , 2026 | 05:59 PM