Share News

ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ సంచలన కౌంటర్!

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:36 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఇరాన్ అదే స్థాయిలో స్పందించింది. ఇవి.. ట్రంప్ 'వ్యూహాత్మక నైరాశ్యాన్ని' చాటి చెబుతున్నాయని పేర్కొంది.

ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ సంచలన కౌంటర్!
Iran Warns of ‘Crushing’ Retaliation After Trump’s ‘Annihilate’ Threat

న్యూయార్క్ / టెహ్రాన్, సెప్టెంబర్ 23: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి (UN) సర్వప్రతినిధి సభలో ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ట్రంప్ బెదిరింపులు ఆయన 'వ్యూహాత్మక నైరాశ్యాన్ని', అమెరికా ఎన్నికల కోసం వాడుకునే 'సొంత ప్రచారాన్ని' తెలియజేస్తున్నాయని, ఇవి క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించవని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ద్వారా ప్రకటించింది.


ఐరాస వేదికగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో ప్రపంచ నేతలను ఉద్దేశించి మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ విషయంలో తమ ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఒకటి ఆ దేశం పునర్నిర్మాణానికి సహకరించే ఒప్పందం చేసుకోవడం, లేదా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌ను సమూలంగా నాశనం చేయడం అని హెచ్చరించారు. నవంబర్ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు.

ట్రంప్‌కు ఇరాన్ సంచలన కౌంటర్

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ జనరల్ స్టాఫ్, ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఆధారం లేని ఆరోపణలు, బెదిరింపులను పదేపదే పునరావృతం చేయడం అమెరికా సైనిక శక్తుల అలసటను, వాషింగ్టన్ బలహీనతను ప్రతిబింబిస్తోందని పేర్కొంది.

పశ్చిమాసియాలో అమెరికా సైనిక ఉనికి చట్టవిరుద్ధమని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గ్లోబల్ ఎకానమీని అమెరికా బందీగా చేసుకుంటోందని ఆరోపించింది.

అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఎవరూ ఊహించని రీతిలో, అత్యంత తీవ్రమైన విధ్వంసకర దెబ్బలు కొట్టడానికి తమ దేశ సాయుధ దళాలు సంపూర్ణ సన్నద్ధతతో ఉన్నాయని హెచ్చరించింది.

ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నేతృత్వంలోని బృందం ఐరాస సమావేశాలకు హాజరైన సమయంలో ఈ ఘాటు వ్యాఖ్యలు చోటుచేసుకోవడం గమనార్హం.


ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 23 , 2026 | 04:37 PM