Share News

మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా

ABN , Publish Date - May 29 , 2026 | 05:31 AM

పశ్చిమాసియాలో మళ్లీ మిలిటరీ ఘర్షణలు మొదలయ్యాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ డ్రోన్‌ స్థావరంపై అమెరికా నేవీ దాడి చేయగా, ఇరాన్‌ ప్రతీకార దాడులకు పాల్పడింది...

మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా

  • ఇరాన్‌ బందర్‌ అబ్బాస్‌ పోర్టు సమీపంలో అమెరికా దాడి

  • ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు

దుబాయి, మే 28: పశ్చిమాసియాలో మళ్లీ మిలిటరీ ఘర్షణలు మొదలయ్యాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ డ్రోన్‌ స్థావరంపై అమెరికా నేవీ దాడి చేయగా, ఇరాన్‌ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ పోర్టు సమీపంలో బుధవారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌ భూభాగంలో ఉన్న డ్రోన్‌ స్థావరంపై అమెరికా నౌకాదళం దాడి చేసింది. తమ నౌకలపై ఇరాన్‌ నాలుగు ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిందని అమెరికా మి లిటరీ సెంట్రల్‌ కమాండ్‌ గురువారం ఆరోపించింది. వాటిని మధ్యలోనే కూల్చేశామని, ఐదో డ్రోన్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతుండగా ఆ లాంచ్‌పాడ్‌పై దాడి చేసి ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లు పేర్కొంది.

ఇరాన్‌ ప్రతీకార దాడులు

అమెరికా దాడులకు ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన సైనిక స్థావరంపై క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. గురువారం ఉదయం 4.30 గంటల సమయంలో ఈ దాడులు జరిగాయి. అయి తే, ఏ దేశంలోని బేస్‌పై దాడి చేశారన్న విషయం వెల్లడించలేదు. కానీ, తమపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగాయని అమెరికా మిత్రదేశం కువైట్‌ ప్రకటించింది. ఈ పరస్పర దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఆయా దేశాలు వెల్లడించలేదు. అమెరికా దాడులను ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘీ ఖండించారు. శత్రుదాడుల నుంచి తమ దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమపై పదేపదే దాడులు చేస్తోందని ఆరోపించారు.

హోర్ముజ్‌ అందరిది: ట్రంప్‌

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. హోర్ముజ్‌ జలసంధిపై ఏ ఒక్కరి ఆధిపత్యాన్ని అంగీకరించబోమని స్పష్టంచేశారు. అది అందరిదని పేర్కొన్నారు. తనపై ఒత్తిడి తెచ్చి ఇరాన్‌ శాంతి ఒప్పందం చేసుకోవాలని చూస్తోందని, అది సాధ్యం కాదని స్పష్టంచేశారు. బుధవారం (స్థానిక కాలమానం) క్యాబినెట్‌ సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న అమెరికా మిడ్‌ టర్మ్‌ ఎన్నికల కోసం నేను ఒప్పందం విషయంలో దిగివస్తానని ఇరాన్‌ భావిస్తోంది. ఆ ఎన్నికలను నేను పట్టించుకోను. నాపై ఎవరూ ఒత్తిడి చేయలేరు’ అని స్పష్టంచేశారు. తమ మిత్రదేశమైన ఒమన్‌కు కూడా ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. హోర్ముజ్‌ విషయంలో ఇతర గల్ఫ్‌దేశాల మాదిరిగానే ఒమన్‌ కూడా వ్యవహరించాలని, లేదంటే ఆ దేశాన్ని పూర్తిగా పేల్చివేస్తామని హెచ్చరించారు. కాగా, పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు నెలకొనటంతో చమురు ధరలు గురువారం పెరిగాయి. బ్రెంట్‌ ముడిచమురు ధర బ్యారెల్‌కు 2 డాలర్ల వరకు పెరిగి 97 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ ముడి చమురు ధర 2.2 శాతం పెరిగి 91.35 డాలర్లకు చేరింది.


కాల్పుల విరమణపై ముందడుగు?

పరస్పరం దాడులు చేసుకుంటూనే అమెరికా-ఇరాన్‌ 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై తుది నిర్ణయానికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఒప్పందం తుది ముసాయిదా ఖరారైందని, అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదించటమే తరువాయి అని అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్‌ అణు కార్యక్రమంపై కూడా రెండు దేశాలు మంగళవారం ఒక నిర్ణయానికి వచ్చాయని ఆక్సియోస్‌ వార్తా సంస్థ పేర్కొంది. అయితే, దీనిపై ఇరాన్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 29 , 2026 | 05:31 AM