Share News

అమెరికాతో ఒప్పందంలో 'మిసైల్స్' లేవు.. భవిష్యత్తులోనూ చేర్చం: ఇరాన్

ABN , Publish Date - Jun 24 , 2026 | 08:43 AM

ఇరాన్ మిసైల్స్ ప్రోగ్రామ్‌పై ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ భాగం కాదని, భవిష్యత్తులో కూడా దీనిని ఎలాంటి ఒప్పందాలలోనూ చేర్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

అమెరికాతో ఒప్పందంలో 'మిసైల్స్' లేవు.. భవిష్యత్తులోనూ చేర్చం: ఇరాన్
Iran's Missile Programme Not Part of US Agreement, Says President Pezeshkian

ఇస్లామాబాద్, జూన్ 24: ఇరాన్ క్షిపణి కార్యక్రమం ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం (MoU) లో ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ భాగం కాదని, భవిష్యత్తులో కూడా దీనిని ఎలాంటి ఒప్పందాలలోనూ చేర్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ పర్యటనలో భాగంగా ఇస్లామాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మిసైల్స్ లేకపోతే మమ్మల్ని నాశనం చేసేవారు

ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా (IRIB) షేర్ చేసిన వీడియో ప్రకారం, పెజెష్కియాన్ తమ క్షిపణి సామర్థ్యాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. 'మా క్షిపణుల గురించిన ప్రస్తావన ఈ ఒప్పందంలో లేదు, ఇకముందు ఎప్పటికీ ఉండదు' అని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్ రక్షణ వ్యూహంలో క్షిపణులు అత్యంత కీలకమైనవని పేర్కొంటూ.. 'ఒకవేళ మా ఆత్మరక్షణ కోసం ఈ మిసైల్స్ గనక లేకపోయి ఉంటే.. ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్‌ను ఎప్పుడో సర్వనాశనం చేసేవి' అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

ప్రాంతీయంగా ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో స్విట్జర్లాండ్‌లో జరిగిన సాంకేతిక చర్చల అనంతరం.. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలపై పాకిస్థాన్ నాయకత్వంతో జరిగిన చర్చల సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు ఈ విషయాలను పంచుకున్నారు.


14 అంశాల ఒప్పందంలో ఏముంది?

గత వారం అమెరికా ప్రభుత్వం ఇరాన్‌తో కుదిరిన ఒప్పందానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. ఒక ఉన్నతాధికారి ఈ 14 అంశాల పత్రాన్ని చదివి వినిపించారు. ఇందులో ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం. ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడం. ఇరాన్ అణు కార్యక్రమంపై భవిష్యత్తులో సాంకేతిక చర్చలు జరపడానికి సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి.

అంతేకాదు, అమెరికా విడుదల చేసిన అధికారిక పత్రంలో ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్‌పై గానీ, ఇతర రక్షణ సామర్థ్యాలపై గానీ ఎలాంటి ఆంక్షల ప్రస్తావన లేదు. ఆయుధాలకు సంబంధించి 'ఇరాన్ అణ్వాయుధాలను సేకరించడం లేదా అభివృద్ధి చేయడం చేయకూడదు' అనే నిబంధన మాత్రమే స్పష్టంగా పేర్కొన్నారు.


మారిన ట్రంప్ వైఖరి!

గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యలు చేపట్టడానికి ఆ దేశ మిసైల్ ప్రోగ్రామ్‌నే ప్రధాన కారణంగా చూపించేవారు. కానీ, దౌత్యపరమైన చర్చలు ఊపందుకోవడంతో ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 (G7) సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. 'మిసైల్స్ సమస్యే కాదు' అని వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి అమెరికా ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ, తమ దేశ రక్షణ కవచమైన క్షిపణి సామర్థ్యాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు ఈ ప్రకటన ద్వారా ప్రపంచ దేశాలకు స్పష్టమైన సంకేతాలు పంపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆలయాల అభివృద్ధికి రూ.9.54 కోట్లు

చంద్రబాబుతో ఆర్టీసీకి ముప్పే: షర్మిల

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 09:01 AM