ఆంక్షల చట్టంతో భారత్, అమెరికా సంబంధాలపై ప్రభావం: విదేశాంగ శాఖ
ABN , Publish Date - Sep 18 , 2026 | 02:17 PM
రష్యా, ఇరాన్‌పై అమెరికా తీసుకురానున్న కొత్త ఆంక్షల చట్టంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై మాత్రమే కాకుండా, భారత్–అమెరికా మధ్య సంబంధాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: రష్యా, ఇరాన్‌పై అమెరికా తీసుకురానున్న కొత్త ఆంక్షల చట్టంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై మాత్రమే కాకుండా, భారత్-అమెరికా మధ్య సంబంధాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. అమెరికా ప్రతినిధుల సభ ఇటీవల లిండ్సే ఓ గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026 బిల్లును ఆమోదించింది. ఇది చట్టరూపం దాలిస్తే, రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు కొనే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం ఉంటుంది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలకూ ఈ చట్టం వర్తించే అవకాశం ఉంది. ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని గమనించామని, తదుపరి పరిణామాలను పరిశీలిస్తున్నామని తెలిపింది.
వివిధ దేశాల నుంచి ఇంధనం కొంటాం..
భారత్ తన ప్రజలకు తక్కువ ధరలో, నిరంతరాయంగా ఇంధనం అందించడం అత్యంత ముఖ్యమైన అంశం అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అందుకోసం వివిధ దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తామని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. ఈ అంశంపై భారత్ ఇప్పటికే అమెరికాతో ఉన్నత స్థాయిలో చర్చలు జరిపినట్లు వెల్లడించింది. కాగా.. భారత్–అమెరికా ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. అలాంటి తరుణంలో ఆంక్షల బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది.
ఈ వార్తలనూ చదవండి:
పాక్-చైనాల సరిహద్దు కమిషన్‌ను తిరస్కరించిన భారత్