భారత్‌పై కొత్త ఆంక్షల పిడుగు!
ABN , Publish Date - Sep 18 , 2026 | 01:39 AM
భారత్‌పై మరో ఆంక్షల పిడుగు పొంచి ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా తదితర దేశాలపై 100ు వరకు సుంకాలు విధించే ‘లిండ్సే ఓ గ్రాహమ్ రష్యా, ఇరాన్ ఆంక్షల బిల్లు 2026’కు అమెరికా ప్రతినిధుల సభ సైతం ఆమోదం తెలిపింది.
రష్యా చమురు కొనుగోలుదారులపై
100 శాతం సుంకాలు
లిండ్సే గ్రాహమ్ బిల్లుకు
అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
అధ్యక్షుడు ట్రంప్‌కు కొత్త అధికారాలు
ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయ్
అమెరికాకు భారత్ హెచ్చరిక
వాషింగ్టన్, న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: భారత్‌పై మరో ఆంక్షల పిడుగు పొంచి ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా తదితర దేశాలపై 100ు వరకు సుంకాలు విధించే ‘లిండ్సే ఓ గ్రాహమ్ రష్యా, ఇరాన్ ఆంక్షల బిల్లు 2026’కు అమెరికా ప్రతినిధుల సభ సైతం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 262 మంది అనుకూలంగా, 159 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అనుకూలంగా ఓటేసిన వారిలో 203 మంది రిపబ్లికన్లతోపాటు 58 మంది ప్రతిపక్ష డెమొక్రాట్ సభ్యులు కూడా ఉండడం విశేషం. సెనేట్ ఆగస్ట్ 7నే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై నిర్ధిష్ట పరిస్థితుల్లో సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఈ బిల్లు కట్టబెడుతోంది. అంటే ఆయా దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై అదనపు సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. అయితే, వెంటనే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయా? అన్నది చూడా ల్సి ఉంది. ముఖ్యంగా భారత్-అమెరికా మధ్య తొలిదశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే.. ఈ ఆంక్షల ముప్పు తొలగిపోయే అవకాశం ఉం టుంది. దివంగత రిపబ్లికన్ నేత లిండే ఓ గ్రా హమ్ ఈ బిల్లును ప్రతిపాదించడం గమనార్హం. కాగా, ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్, చైనా గట్టిగా స్పందించాయి.
140 కోట్ల ప్రజల ఇంధన భద్రత తమకు ముఖ్యమని.. తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను భారత్ తీసుకుంటుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపైనే కాకుండా, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువోజియాకున్ స్పందిస్తూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం లేని ఏ చర్యను అయినా చైనా వ్యతిరేకిస్తుందన్నారు. ‘సమానత్వం, పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన చైనా ఇతర దేశాలతో ఆర్థిక, వాణిజ్య సహకారం కొనసాగిస్తుంది’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారుల ఆరా.. శాటిలైట్ మ్యాప్‌లతో పరిశీలన
ఎన్నికల అఫిడవిట్‌తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా!: మంత్రి పొంగులేటి