అమెరికాలో భారతీయ విద్యార్థి అదృశ్యం
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:14 AM
అమెరికాలో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించిన అతడు.. మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు కాలిఫోర్నియాకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అతడిలా అదృశ్యమవ్వడం చర్చనీయాంశమైంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య.. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అతడు ఈ నెల 9 నుంచి కనిపించకుండాపోగా.. ఆ విద్యార్థి కోసం చేపట్టిన గాలింపు చర్యలు నేటితో 5వ రోజుకు చేరుకున్నాయి. అతడు చివరగా.. బర్క్‌లీ హిల్స్‌లోని లేక్ అంజా సమీపంలో అగుపించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. సాకేత్ ఆచూకీ కోసం అక్కడి అధికారులు.. అతడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపింది.
ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన సాకేత్.. కాలిఫోర్నియాలో కెమికల్ అండ్ బయోమోలిక్యులర్ ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్నాడు. అతడు ఫిబ్రవరి 9న చివరిసారిగా క్యాంపస్‌కు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో కనిపించాడని అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత అతడి పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్ ఒకటి.. క్యాంపస్ దగ్గరలో ఉండే రీజనల్ పార్క్ సమీపంలో ఉన్నట్టు గుర్తించారు అధికారులు. దీంతో ఆ పరిసర ప్రాంతం సహా నగర వ్యాప్తంగా సాకేత్ సన్నిహితులతో కలిసి తీవ్రంగా గాలించారు అధికారులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
విదేశాల్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల భద్రత గురించి లోక్‌సభలో ఇటీవల ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్న లేవనెత్తారు. దీంతో భారతీయ విద్యార్థులను సురక్షితంగా ఉంచడానికి విదేశాంగ శాఖ చేపట్టిన తన ప్రయత్నాలను హైలెట్ చేస్తూ.. విదేశాల్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పింది. 'భారత మిషన్లు లేదా పోస్ట్‌లు.. తమ అధికార పరిధిలోని విదేశీ విశ్వవిద్యాలయాలలో చేరిన భారతీయ విద్యార్థులతో క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటాయి. వారు విదేశాలకు చేరాక ఎప్పటికప్పుడు ముందస్తు సెషన్లు నిర్వహిస్తూ.. వారికి మార్గదర్శకంగా నిలుస్తుంటాయి' అని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఓ విద్యార్థి అదృశ్యమవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి:
బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీభారీ విజయం
10 వేల కండోమ్స్ ఖతం.. వింటర్ ఒలింపిక్స్ క్రీడా గ్రామాల్లో కొరత