బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీభారీ విజయం
ABN , Publish Date - Feb 14 , 2026 | 01:50 AM
బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ‘బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ)’ ఘన విజయం సాధించింది. 13వ పార్లమెంటు ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుపొందింది. రెండు దశాబ్దాల తర్వాత తారిక్ రహ్మాన్ నేతృత్వంలో.....
299 స్థానాలకు 212 సీట్లు కైవసం
70 స్థానాలకు పరిమితమైన జమాతే పార్టీ
ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న బీఎన్‌పీ అధినేత తారిక్ రహ్మాన్
17 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి అధికారం హస్తగతం చేసుకున్న తారిక్
అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
హసీనాను అప్పగించాలని బీఎన్‌పీ విజ్ఞప్తి
ఢాకా/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ‘బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ)’ ఘన విజయం సాధించింది. 13వ పార్లమెంటు ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుపొందింది. రెండు దశాబ్దాల తర్వాత తారిక్ రహ్మాన్ నేతృత్వంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు గాను మిత్రపక్షాలతో కలిపి 212 సీట్లు గెలుచుకున్నట్లు బీఎన్‌పీ శుక్రవారం ప్రకటించింది. తారిక్ రహ్మాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఇక జమాతే ఇస్లామీ పార్టీ 70 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు మిగిలిన స్థానాలు గెలుచుకున్నారు. ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బీఎన్‌పీ అధినేత తారిక్ రహ్మాన్ ఢాకా-17, బోగ్రా-6 స్థానాల నుంచి బరిలోకి దిగి, రెండు చోట్లా గెలిచారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే రహ్మాన్ తల్లి, మాజీ ప్రధాని ఖలీదా జియా మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల విజయోత్సవాలను వాయిదా వేయాలని రహ్మాన్ పార్టీ కార్యకర్తలను కోరారు.
ఢాకాలో హిందూ నేత గెలుపు
బీఎన్‌పీకి చెందిన సీనియర్ మైనారిటీ హిందూ నేత గయేశ్వర్ చంద్ర రాయ్ పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఢాకా-3 నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఆయన.. జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన షహినూర్ ఇస్లాంపై 99,163 ఓట్ల తేడాతో గెలుపొందారు. బంగ్లాదేశ్‌లో హిందువులను హత్య చేయడం, వరసగా దాడులు జరుగుతున్న తరుణంలో రాయ్ గెలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. కాగా, జమాతే ఇస్లామీ నుంచి బరిలో నిలిచిన ఏకైక హిందూ నేత కృష్ణ నంది బీఎన్‌పీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక పశ్చిమబెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో జమాతే ఇస్లామీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. సిల్హెత్, చిట్టగాంగ్, మిమెన్‌సింగ్ ప్రాంతాల్లో జమాతే అభ్యర్థులు విజయం సాధించారు. ఇది భారత్‌కు కాస్త ఆందోళనకర అంశమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేషనల్ సిటిజెన్ పార్టీ నేత హస్నత్ అబ్దుల్లా కూడా గెలుపొందారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో హస్నత్ కీలక పాత్ర పోషించారు. బీఎన్‌పీ అధినేత తారిక్ రహ్మాన్(60) బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బంగ్లా మాజీ అధ్యక్షుడు జియావుర్ రహ్మాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడే తారిక్. 2002-06 మధ్య ఖలీదా అధికారంలో ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. అప్పుడే రహ్మాన్‌పై అవినీతి కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా సహా బంగ్లా విపక్షాలు ఆయన్ను ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించాయి. హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత రహ్మాన్ ఓ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం 2008లో లండన్ వెళ్లిపోయారు. అప్పటినుంచి అక్కడే ఉంటూ.. బీఎన్‌పీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. గత డిసెంబరులో తల్లి ఖలీదా అనారోగ్యానికి గురవడంతో 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టారు. తల్లి మరణానంతరం పార్టీ పగ్గాలు అందుకున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఎన్‌పీ నేత తారిక్ రహ్మాన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన తారిక్‌కు ఫోన్ చేసి, మాట్లాడారు. ప్రధాని మోదీకి బీఎన్‌పీ ధన్యవాదాలు తెలియజేసింది. అయితే, హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని డిమాండ్ చేసింది. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఈ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం.