Share News

వెనెజువెలా చమురు కోసం రిలయన్స్‌కు అమెరికా లైసెన్సు!

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:45 AM

వెనెజువెలా నుంచి చమురును దిగుమతి చేసుకోవడానికి రిలయన్స్‌ సంస్థకు అమెరికా లైసెన్సు మంజూరు చేసింది. దీనితో వెనెజువెలా నుంచి నేరుగా ఎలాంటి ఆంక్షలూ లేకుండా రిలయన్స్‌ చమురును దిగుమతి చేసుకుని..

వెనెజువెలా చమురు కోసం రిలయన్స్‌కు అమెరికా లైసెన్సు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: వెనెజువెలా నుంచి చమురును దిగుమతి చేసుకోవడానికి రిలయన్స్‌ సంస్థకు అమెరికా లైసెన్సు మంజూరు చేసింది. దీనితో వెనెజువెలా నుంచి నేరుగా ఎలాంటి ఆంక్షలూ లేకుండా రిలయన్స్‌ చమురును దిగుమతి చేసుకుని.. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్ముకునేందుకు అవకాశం లభించింది. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతకు బదులుగా వెనెజువెలా నుంచి రాయితీ ధరకు చమురు అందించే దిశగా భారత్‌కు అమెరికా ఈ వెసులుబాటు కల్పించిందని ఆ దేశ అధికారవర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్‌ ఇప్పటికే వెనెజువెలా సంస్థ విటోల్‌ నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా కోసం ఆర్డర్‌ చేసినట్టు వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. మన దేశ ప్రభుత్వ రంగ సంస్థలు ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ కూడా వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు వెల్లడించాయి. వాస్తవానికి 2020కి ముందు వెనెజువెలా నుంచి రిలయన్స్‌తోపాటు ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ తదితర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గణనీయంగా చమురు కొనుగోలు చేసేవి. అమెరికా ఆంక్షల కారణంగా వెనెజువెలా నుంచి చమురు దిగుమతులు నిలిచిపోయాయి. యుద్ధ సమయంలో రష్యా తన చమురుపై రాయితీ ఇవ్వడంతో భారత సంస్థలు ఆ దేశం నుంచి భారీగా చమురు కొనుగోళ్లు చేపట్టాయి. తాజాగా అమెరికా ఒత్తిడి, ఆంక్షల కారణంగా రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు తగ్గాయి. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్న అమెరికా ఆ దేశ చమురుపై పట్టు సాధించి, ఆంక్షలను సడలించింది.

Updated Date - Feb 14 , 2026 | 01:45 AM