10 వేల కండోమ్స్ ఖతం.. వింటర్ ఒలింపిక్స్ క్రీడా గ్రామాల్లో కొరత
ABN , Publish Date - Feb 13 , 2026 | 09:58 PM
వింటర్ ఒలింపిక్స్ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన క్రీడాగ్రామాల్లో కండోమ్స్ కొరత ఏర్పడింది. దీంతో, కొత్త వాటిని తెప్పించేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటలీలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో నిర్వాహకులకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. అథ్లెట్ల బస కోసం ఏర్పాటు చేసిన క్రీడా గ్రామాల్లో కండోమ్స్‌కు కొరత ఏర్పడింది. తొలుత నిర్వాహకులు 10 వేల ఉచిత కండోమ్స్‌ను ఏర్పాటు చేశారు. కానీ రోజుల వ్యవధిలోనే అవి అయిపోవడంతో మరిన్ని తెప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు (Winter Olympics - Condom Shortage).
మిలాన్, కోర్టీనా డీ ఆంపెజ్జో సహా మొత్తం ఆరు ప్రాంతాల్లో క్రీడాగ్రామాలు ఏర్పాటు చేశారు. ఈ క్రీడా గ్రామాలన్నిటిలో కండోమ్స్‌కు కొరత ఏర్పడింది. మొత్తం 2,900 మంది క్రీడాకారుల కోసం తొలి విడతగా దాదాపు 10 వేల వరకూ ఉచిత కండోమ్స్‌ను సిద్ధం చేశారు. కేవలం మూడు రోజుల్లోనే అవన్నీ అయిపోవడంతో కొత్త వాటి కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
క్రీడాగ్రామాల్లో అథ్లెట్లకు కండోమ్స్ అందుబాటులో ఉంచడం ఒలింపిక్ క్రీడల్లో చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అథ్లెట్ల లైంగిక ఆరోగ్యం రీత్యా నిర్వాహకులు వీటిని అందుబాటులో ఉంచుతారు. పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా 10,500 మంది క్రీడాకారుల కోసం 2 లక్షల పురుష కండోమ్స్, 20 వేల మహిళల కండోమ్స్‌ను అందుబాటులో ఉంచారు. అంతకుముందు ఈవెంట్స్‌లో సుమారు 3 లక్షల వరకూ కండోమ్స్‌ను రెడీ చేశారు. అయితే, కొవిడ్ దృష్ట్యా 2021లో ఒలింపిక్స్ క్రీడాకారుల లైంగిక కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో తాజా ఒలింపిక్స్‌లో తొలి విడతగా కేవలం 10 వేలే ఏర్పాటు చేయడంపై చర్చ జరుగుతోంది.