Share News

సత్తా చాటిన భారతీయ అమెరికన్లు

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:28 AM

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన పలువురు భారతీయ అమెరికన్‌ నేతలు సత్తా చాటారు.

సత్తా చాటిన భారతీయ అమెరికన్లు
american indians

  • 8వసారి అమీ బేరా గెలుపు.. 6వసారి గెలిచిన రో ఖన్నా, ప్రమీల

  • మేరీల్యాండ్‌ గవర్నర్‌ పదవిని నిలబెట్టుకున్న అరుణా మిల్లర్‌

  • న్యూయార్క్‌ అటార్నీ రేసులో సరితా కోమటిరెడ్డి ఓటమి

  • అమెరికా ప్రతినిధుల సభకు పలువురి ఎన్నిక

వాషింగ్టన్‌, హైదరాబాద్‌ సిటీ, బెంగళూరు, నవంబరు 4: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన పలువురు భారతీయ అమెరికన్‌ నేతలు సత్తా చాటారు. వీరిలో అమీబేరా, రో ఖన్నా, సుహాస్‌ సుబ్రమణ్యం, ప్రమీలా జయ్‌పాల్‌ ప్రతినిధుల సభకు(హౌస్‌కు) తిరిగి ఎన్నిక కాగా.. పియా దాండియా తొలిసారి హౌస్‌లో అడుగుపెట్టారు. అమీబేరా ఏకంగా 8వసారి ఎన్నిక కావటం విశేషం. భారతీయ అమెరికన్‌ చట్టసభ సభ్యుల్లో అత్యంత సీనియర్‌గా ఆయనకు పేరుంది. రో ఖన్నా, ప్రమీలా జయ్‌పాల్‌ ఆరోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌తో అనుబంధం కలిగిన అరుణా మిల్లర్‌, నబీలా సయ్యద్‌ విజయం సాధించారు. మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న అరుణా మిల్లర్‌ ఎన్నికల్లో విజయం సాధించి పదవిని నిలబెట్టుకున్నారు. ఇల్లినాయిస్‌ రాష్ట్ర సెనేట్‌ 26వ జిల్లా నుంచి నబీలా సయ్యద్‌ గెలిచారు. కాగా, డెమోక్రటిక్‌ ప్రభంజనం కారణంగా రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ పడిన పలువురు భారతీయ అమెరికన్లు ఓటమి పాలయ్యారు. వీరిలో ట్రంప్‌ స్వయంగా మద్దతు పలికిన వివేక్‌ రామస్వామితోపాటు మహేశ్‌ గానోర్కర్‌, రితేశ్‌టాండన్‌, నీరవ్‌సేత్‌ తదితరులు ఉన్నారు. న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ పదవి కోసం రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ పడిన సరితా కోమటిరెడ్డి డెమోక్రటిక్‌ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. టెక్సాస్‌ ప్రతినిధుల సభకు డెమోక్రటిక్‌ పార్టీ నుంచి పోటీ పడిన పూజా సేథి గెలిచారు.


అమీ బేరా: కాలిఫోర్నియాలోని 3వ జిల్లా నుంచి మరోసారి ఎన్నికైన అమీబేరా (61) పూర్తి పేరు అమరీశ్‌ బాబూలాల్‌ బేరా. 2012లో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. తాజాగా రికార్డు స్థాయిలో 8వసారి విజయం సాధించారు. గుజరాత్‌ నుంచి అమెరికాకు వలస వచ్చిన కుటుంబంలో అమీబేరా జన్మించారు. మెడిసిన్‌ చదవి వైద్యవృత్తిని చేపట్టారు. సాక్రమెంటో కౌంటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం చట్టసభ సభ్యుడిగా వరుస విజయాలు సాధించారు.

సుహాస్‌ సుబ్రమణ్యం: వర్జీనియా 10వ జిల్లా నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో జన్మించిన సుహాస్‌ సుబ్రమణ్యం (40) న్యాయవాది, పారిశ్రామికవేత్త. బరాక్‌ ఒబామా హయాంలో వైట్‌హౌస్‌ సాంకేతిక విధానం సలహాదారుగా పని చేశారు. 2019 నుంచి 2023 వరకు వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభలో సభ్యుడిగా ఉన్నారు. 2023-24లో అదే రాష్ట్ర సెనేట్‌లో సభ్యుడిగా ఉన్నారు. సుహాస్‌కు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. ఆయన తల్లిదండ్రులది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలుకాగా ఉద్యోగరీత్యా వారు కొంతకాలం సికింద్రాబాద్‌లో నివసించారు.

రోఖన్నా: సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా ఉండే కాలిఫోర్నియా 17వ జిల్లా నుంచి తిరిగి ఎన్నికయ్యారు. అమెరికా కాంగ్రె్‌సకు రో ఖన్నా (50) ఎన్నికవటం ఆరోసారి. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలిచేందుకు పోటీ పడిన బెర్నీ శాండర్స్‌ ప్రచార కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. బాలికల మీద అత్యాచారాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైల్స్‌ను విడుదల చేయించటానికి రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు థామస్‌ మెస్సీతో కలిసి పని చేశారు. రో ఖన్నా తాత అమర్‌నాథ్‌ విద్యాలంకార్‌ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని నాలుగేళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు.


ప్రమీల జయ్‌పాల్‌: వాషింగ్టన్‌ 7వ జిల్లా నుంచి హౌస్‌ సభ్యురాలిగా ఉన్న ప్రమీల జయ్‌పాల్‌ అదే స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు. 1965లో చెన్నైలో జన్మించిన ప్రమీల.. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వచ్చారు. ఎంబీఏ పూర్తి చేశారు. 2016లో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఆ ఘనతను సాధించిన తొలి దక్షిణాసియా-అమెరికన్‌ మహిళగా రికార్డు నెలకొల్పారు.

పియా దాండియా: ఫ్లోరిడాలోని 22వ జిల్లా నుంచి గెలుపొందారు. రాజకీయాల్లోకి రాకముందు పియా దాండియా (39) ఉపాధ్యాయురాలిగా, హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పని చేశారు. తొలిసారిగా అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

అరుణా మిల్లర్‌: మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వరుసగా రెండవసారి గెలుపొందిన అరుణా మిల్లర్‌ 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు మెకానికల్‌ ఇంజినీరు. ఆమెకు ఏడేళ్ల వయసులో తండ్రి ఉద్యోగరీత్యా కుటుంబమంతా అమెరికాకు వెళ్లారు. అరుణ ఇంజనీరింగ్‌ చదివారు. ఇంజనీర్‌గా 25 ఏళ్లపాటు పని చేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి.. 2010లో డెమోక్రటిక్‌ పార్టీ నుంచి మేరీల్యాండ్‌ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఎనిమిదేళ్ల పాటు సభ్యురాలిగా సేవలందించారు. మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా 2022లో ఎన్నికయ్యారు.

నబీలా సయ్యద్‌: ఇల్లినాయిస్‌ రాష్ట్ర సెనేట్‌ 26వ డిస్ట్రిక్టు రిపబ్లికన్‌ పార్టీ సిట్టింగ్‌ అభ్యర్థిపై నబీలా సయ్యద్‌ (27) విజయం సాధించారు. నాలుగేళ్ల కిందటే ఇల్లినాయిస్‌ ప్రతినిధుల సభకు ఎన్నికై.. సభలో అడుగుపెట్టిన అత్యంత పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. 2024 ఎన్నికలలోనూ గెలిచారు. నబీలా సయ్యద్‌ తల్లిదండ్రులు 1980లో హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే రాజకీయాలలోకి అడుగుపెట్టినట్లు ఓ సందర్భంలో నబీలా చెప్పారు. కాగా, మరో హైదరాబాదీ గజాలా హష్మీ ప్రస్తుతం వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

డెమోక్రాట్లపై ట్రంప్ చివరి అస్త్రం! ఎలా పనిచేస్తుందంటే.

అమెరికా తొలి ముస్లిం సెనెటర్ భార్యకు భారతీయ మూలాలు

Updated Date - Nov 05 , 2026 | 05:39 AM