యుద్ధం.. తీవ్రం
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:58 AM
పశ్చిమాసియాలో యుద్ధం మరో తీవ్రమైన మలుపు తీసుకుంటోంది. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడితే.. ఇరాన్ బదులుగా ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది.
అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ
ఇరాన్‌కు మద్దతుగా హెజ్బొల్లా, ఇరాకీ సాయుధ మిలీషియా
దాడులు నాలుగైదు వారాలు కొనసాగుతాయన్న ట్రంప్
ఇరాన్‌పై కొన్ని అరబ్ దేశాలూ దాడి చేస్తాయని ప్రకటన
చర్చల కోసం ప్రయత్నించట్లేదని స్పష్టం చేసిన ఇరాన్
ఇజ్రాయెల్, ఇరాక్, గల్ఫ్ దేశాల్లో ఇరాన్ క్షిపణి దాడులు
ఆరామ్‌కో చమురు రిఫైనరీపై దాడి.. సరఫరా బంద్
ఇరాన్‌పై మరింతగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపైనా భీకర దాడి
నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి?
హోర్ముజ్ మార్గంలో చమురు నౌకలపై డ్రోన్ దాడులు
భారతీయుడు సహా ఇద్దరి మృతి
కూలిపోయిన మూడు అమెరికా ఎఫ్-15ఈ ఫైటర్లు
వాటిని కువైట్ పొరపాటున కూల్చేసిందన్న అమెరికా
వాటిలో ఒక దాన్ని తామే కూల్చేశామన్న ఇరాన్
ఖమేనీ భార్య మృతి.. తాత్కాలిక సుప్రీం అరాఫీ కూడా చనిపోయినట్లుగా ప్రచారం
గల్ఫ్ యుద్ధం ప్రమాదకర మలుపు తీసుకుంటోంది! అమెరికాకు తోడుగా రంగంలోకి దిగుతామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సంయుక్తంగా ప్రకటించాయి! మరోవైపు హెజ్బొల్లా, ఇరాకీ సాయుధ మిలీషియాలు ఇరాన్‌కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్‌పై ఆగ్రహంగా ఉన్న అరబ్ దేశాలూ దాడుల్లో కలిసి వస్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. యుద్ధం నాలుగైదు వారాలు కొనసాగే అవకాశముందన్నారు. చర్చలకు ససేమిరా అన్న ఇరాన్.. దాడులను మరింత తీవ్రం చేసింది. ఇక, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ భార్య కూడా మరణించగా.. ఖమేనీ తర్వాత ఇరాన్ సుప్రీం కమాండర్‌గా తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టిన అరాఫీ కూడా మరణించారని ప్రచారం జరుగుతోంది. దీనిని ఇరాన్ ధ్రువీకరించడం లేదు!!
దుబాయ్/వాషింగ్టన్, మార్చి 2: పశ్చిమాసియాలో యుద్ధం మరో తీవ్రమైన మలుపు తీసుకుంటోంది. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడితే.. ఇరాన్ బదులుగా ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. సోమవారం ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ, ఇరాకీ సాయుధ మిలీషియా గ్రూపులు తెరపైకి వస్తే.. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌కు తోడుగా ఫ్రాన్స్, యూకే, జర్మనీ రంగంలోకి వచ్చాయి. ఈ మేరకు మూడు దేశాలు సోమవారం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి. హెజ్బొల్లా ఆదివారం రాత్రి ఉన్నట్టుండి ఇజ్రాయెల్‌పైకి దాడికి దిగడంతో.. ప్రతిగా ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు మద్దతుగా యూకే తెరపైకి రావడంతో సైప్ర్‌సలోని యూకే సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. అంతేకాదు భారీ స్థాయిలో క్షిపణి దాడులు కూడా చేస్తామని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. మరోవైపు తమ ప్రాంతాలపై దాడులు ఆపకుంటే.. తాము ఇరాన్‌పై దాడికి దిగుతామని సౌదీ, కువైట్, ఖతార్, బహ్రెయిన్ హెచ్చరించాయి.
ఇరాన్‌పై దూకుడుగా దాడులు
ఇజ్రాయెల్, అమెరికా ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇస్ఫహాన్ నగరాల్లో భీకర దాడులకు దిగాయి. ఫైటర్లు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. మొత్తంగా ఇరాన్‌లో 130 పట్టణాలపై దాడులు చేశాయి. నౌకాదళ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వ్యవస్థలు, డ్రోన్ స్థావరాలపై ప్రత్యేక దృష్టిపెట్టి విధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) సోమవారం ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన రెండు సుఖోయ్-24 ఫైటర్లను కూల్చేశామని ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌లో మృతుల సంఖ్య 555కు చేరిందని రెడ్ క్రిసెంట్ సంస్థ వెల్లడించింది. టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రి సహా ఇరాన్‌వ్యాప్తంగా 9 ఆస్పత్రులపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయని ఇరాన్ పార్లమెంట్ హెల్త్ కమిటీ సభ్యురాలు ఫాతిమా బేగీ తెలిపారు.

అరాఫీ చనిపోయారంటూ ప్రచారం..
కాగా ఖమేనీ మరణంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన అయతుల్లా అలీరెజా అరాఫీ సోమవారం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించారనే ప్రచారం జరిగింది. కొన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థలు, సోషల్ మీడియాలో దీనిపై కథనాలు వచ్చాయి. కానీ అంతర్జాతీయ వార్తా సంస్థలుగానీ, ఇరాన్ అధికారిక మీడియాగానీ దీనిని ధ్రువీకరించలేదు. ఇక ఇరాన్ కొత్త నేతలు తనతో చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చారన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ భద్రతా మండలి చీఫ్ అలీ లరిజని ఖండించారు. తాము అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
దాడులు ఉధృతం చేసిన ఇరాన్..
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేస్తుండటంతో అమెరికా తన ఫైటర్లను సైప్రస్‌కు తరలిస్తోందని.. అక్కడి నుంచి కూడా వెళ్లిపోయేలా సైప్రస్‌పై భారీ స్థాయిలో క్షిపణి దాడులు చేపడతామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్ ఇబ్రహీం జబారి సోమవారం ప్రకటించారు. ఇక బహ్రెయిన్, ఖతార్, దుబాయ్, అబుధాబి, సౌదీ, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ వందలాది క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. చాలా వరకు క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నా కొన్ని మాత్రం లక్ష్యాలను తాకాయు. సోమవారం ఆ దేశాల్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. శని, ఆదివారాల్లో 172 క్షిపణులు, 817 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నామని యూఏఈ ప్రకటించింది. ఇక ‘ట్రూ ప్రామిస్ 4 ఆపరేషన్’లో భాగంగా పెద్ద సంఖ్యలో ఖైబర్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్, జెరుసలేంలోని ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం, ఎయిర్‌ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి చేశామని పేర్కొంది. అయితే ఇది తప్పుడు ప్రచారమని, ఇరాన్ క్షిపణులేవీ తాకలేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక ఇరాన్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లోని బీట్ షెమె్‌షలో తీవ్ర నష్టం జరిగింది. 9 మంది మరణించగా.. మరో 11 మంది జాడ తెలియడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఇరాక్‌లోని బాగ్దాద్‌లో అమెరికా రాయబార కార్యాలయం, ఎర్బిల్ నగరంలోని విమానాశ్రయంపై ఇరాన్ అనుకూల ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్’ ఉగ్రవాద సంస్థ 23 డ్రోన్ దాడులు చేసింది. ఖమేనీని చంపినందుకు ప్రతీకారంగా దాడులు చేపట్టినట్టు ప్రకటించింది.

అమెరికాకు తోడుగా నిలుస్తాం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి, ఇరాన్ ప్రతిదాడులను ఎదుర్కొనేందుకు తాము అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు యూకే, ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. ఈ మేరకు మూడు దేశాల ప్రభుత్వాధినేతలు కీర్ స్టార్మర్, ఎమ్మాన్యుయెల్ మేక్రాన్, ఫ్రెడరిక్ మెర్జ్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. తమ మిత్రదేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులు దారుణమని.. పశ్చిమాసియా ప్రాంతంలోని తమ మిలిటరీ సిబ్బంది, పౌరులకు దీనితో ముప్పు ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ దేశ, మిత్రదేశాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసే సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. అయితే నేరుగా ఇరాన్‌పై దాడికి దిగుతారా, మిత్రదేశాలకు సహాయకంగా ఉంటారా అన్న వివరాలేమీ వెల్లడించలేదు. నిజానికి ఇరాన్‌పై యుద్ధం లో అమెరికాకు తోడుగా ఉంటామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆదివారమే ప్రకటించారు. ఈ క్రమంలో సైప్ర్‌సలోని అక్రోటిరిలో ఉన్న యూకే సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసి, రన్‌వేను ధ్వంసం చేసింది. మరోవైపు ఫ్రాన్స్‌లోని నౌకాదళ స్థావరంపై డ్రోన్ దాడి జరిగినట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. యూఏఈ, బహ్రెయిన్‌లలోని అమెజాన్ వెబ్‌సర్వీసెస్ క్లౌడ్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరిగాయి. యూఏఈ డేటా సెంటర్‌పైకి ఒక వస్తువు దూసుకొచ్చి మంటలు చెలరేగాయని, దానితో డేటా సెంటర్ పనిచేయడం లేదని అమెజాన్ సోమవారం ప్రకటించింది. దానితోపాటు బహ్రెయిన్ డేటా సెంటర్‌లోనూ సమస్యలు తలెత్తాయని తెలిపింది. దీనికి కారణమేంటో వెల్లడించలేదు.
నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి?
ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)లోని ఇరాన్ ప్రతినిధి రెజా నజాఫి వెల్లడించారు. ఇరాన్ శాంతియుత ప్రయోజనాల కోసం చేపట్టిన అణు కేంద్రాలపై దాడి చేయడం సరికాదని సోమవారం ఐఏఈఏ సమావేశంలో పేర్కొన్నారు. దీనిపై ఐఈఈఏ చీఫ్ రఫేల్ గ్రోసీ స్పందించారు. ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడి జరిగినట్టు కచ్చితమైన సమాచారం లేదని, ఇరాన్ కూడా స్పందించడం లేదని పేర్కొన్నారు. దాడి జరిగితే అణుకేంద్రం నుంచి వెలువడే అణుధార్మికత (రేడియేషన్) ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కూలిన మూడు అమెరికన్ ఎఫ్-15ఈ ఫైటర్లు..
సోమవారం అమెరికాకు చెందిన మూడు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ మల్టీరోల్ ఫైటర్లు కువైట్‌లో కూలిపోయాయి. అందులో ఒక దానిని ఇరాన్ క్షిపణులతో కూల్చివేసినట్టుగా ఆ దేశ మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక ఫైటర్ గింగిరాలు తిరుగుతూ నేలకూలుతున్న వీడియోలను ప్రసారం చేశాయి. అయితే కువైట్ గగనతల రక్షణ వ్యవస్థలు ఆ విమానాలను పొరపాటున శత్రుదేశానికి చెందినవిగా భావించి కూల్చివేశాయని అనంతరం కువైట్ ప్రభుత్వం, అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించాయి. ఆ ఫైటర్లలోని ఆరుగురు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని తెలిపాయి. ఒక్కో ఎఫ్-15ఈ ఫైటర్ విలువ రూ.1,100 కోట్లు.

ఆరామ్‌కో చమురు రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి
సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన రాస్ తనురా రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. కొన్నింటిని మధ్యలోనే అడ్డుకోగా రెండు డ్రోన్లు రిఫైనరీని తాకి పేలుళ్లు సృష్టించాయి. దీనితో రిఫైనరీని తాత్కాలికంగా నిలిపివేశామని సౌదీ రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. రాస్ తనురా రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ ఆరామ్‌కోకు చెందినది. రిఫైనరీకి ఏ స్థాయిలో నష్టం జరిగిందనే వివరాలు వెల్లడి కాలేదు. ఇక కువైట్‌లోని అహ్మదీ చమురు రిఫైనరీపై డ్రోన్ దాడికి ప్రయత్నం జరిగింది.
చమురు ట్యాంకర్‌ను తాకిన డ్రోన్.. భారతీయ ఉద్యోగి మృతి
హోర్ముజ్ జలసంధిలో ఒమన్ తీరానికి సమీపంగా మార్షల్ ఐల్యాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న ఎంకేడీ వ్యోమ్ చమరు ట్యాంకర్ నౌకపై ఇరాన్ సోమవారం డ్రోన్ దాడి చేసింది. దీనితో నౌక ఇంజన్ రూమ్‌లో పేలుడు జరిగి మంటలు చెలరేగాయి. ఒక భారతీయ ఉద్యోగి మృతిచెందారు. ఘటన సమయంలో నౌకలో 16 మంది భారతీయులు, నలుగురు బంగ్లాదేశీలు, ఒక ఉక్రెయినీ సహా 21 మంది సిబ్బంది ఉన్నారని ఒమన్ మ్యారీటైమ్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది. వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది. శనివారం పలావ్ జెండాతో ప్రయాణిస్తున్న స్కైలైట్ చమురు ట్యాంకర్‌పైనా డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. అందులోని 15 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇక బహ్రెయిన్ పోర్టులో ఆగి ఉన్న అమెరికా ‘స్టెనా ఇంపరేటివ్’ చమురు నౌకపైనా సోమవారం డ్రోన్ దాడులు జరిగి, మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పోర్టుకు చెందిన ఉద్యోగి ఒకరు మరణించారు.
