Elon Musk: గ్రోక్ డీప్ ఫేక్ ఫొటోస్.. ఎలన్ మస్క్‌కు మరో షాక్
ABN , Publish Date - Jan 16 , 2026 | 01:30 PM
కొన్ని రోజులుగా ఎక్స్‌లో ఇన్‌బిల్డ్ అయిన గ్రోక్ ఏఐ చేసిన తప్పిదం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనాలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మస్క్‌కు మరో షాక్ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్(Elon Musk)కు చెందిన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లోని గ్రోక్ AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చాట్ ద్వారా అశ్లీల, అసభ్యకమైన డీప్‌ఫేక్ చిత్రాలు సృష్టిస్తున్నట్లు ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లల ఫొటోలను అశ్లీలంగా జనరేట్ చేయడం ఈ వివాదానికి కారణం అయ్యింది. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్‌కు మరో షాక్ తగిలింది. ప్రముఖ రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్(Ashley St.Clair), మస్క్ కంపెనీ ఎక్స్ ఏఐ( xAI)పై.. న్యూయార్క్ స్టేట్ సుప్రీం కోర్టులో దావా వేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
మస్క్ రూపొందించిన గ్రోక్(Grok)AI చాట్‌బాట్ తన అనుమతి లేకుండా అశ్లీలమైన, అభ్యంతరకరమైన డీప్‌ఫేక్(Deep fake)ఇమేజ్‌లు క్రియేట్ చేస్తోందని ఆష్లీ ఆరోపించారు. వినియోదారులు ఇచ్చిన ప్రాంప్ట్‌ల ఆధారంగా గ్రోక్ తనను అసభ్యకర రీతిలో చూపే చిత్రాలను రూపొందిస్తోందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కొన్ని ఫొటోలు ఆ సంస్థ దృష్టికి తీసుకువెళ్లగా.. నిలిపివేస్తామని మాటిచ్చినప్పటికీ మళ్లీ మళ్లీ అలాంటి చిత్రాలను రూపొందిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, తనకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
అయితే.. ఇప్పటివరకు దీనిపై ‘ఎక్స్’ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గతంలో కూడా ఎలన్ మస్క్‌పై ఆష్లీ సంచలన ఆరోపణలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎలన్ మస్క్‌తో తనకు సంబంధం ఉందని, తమ ఇద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడని తెలిపింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని, అందుకోసం మస్క్.. తనకు 15 మిలియన్ల డాలర్లు ఆఫర్ చేసినట్లు ఆమె చెప్పారు. అప్పట్లో ఈ న్యూస్ పెను సంచలనాలు సృష్టించింది.
ఇవీ చదవండి:
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..
మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు