Supreme Court-Mamata Banerjee: మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:04 PM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్లకు సంబంధించిన కేసులో, ఈడీ అధికారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అంతేకాదు, ఇలాంటి చర్యలు అరాచకానికి దారితీస్తాయని వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ, జనవరి 15: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కారుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయంపై ఈడీ (Enforcement Directorate) జరిపిన సోదాల నేపథ్యంలో తలెత్తిన వివాదంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, ఈడీ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లపై స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
వివాదం నేపథ్యం :
జనవరి 8న కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయం, దాని డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకుని తమ దర్యాప్తునకు ఆటంకం కలిగించారని, కీలక ఆధారాలను, డిజిటల్ పరికరాలను తీసుకువెళ్లారని ఈడీ ఆరోపించింది. దీనిపై బెంగాల్ పోలీసులు ఈడీ అధికారులపైనే కేసులు నమోదు చేయడంతో, ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు:
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని అభిప్రాయపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థల పనిలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం తీవ్రమైన విషయమని, ఇది 'అరాచకానికి' (Lawlessness) దారితీస్తుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
FIRలపై స్టే:
ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లపై తదుపరి విచారణ జరగకుండా స్టే విధించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, డీజీపీ రాజీవ్ కుమార్, కోల్‌కతా పోలీస్ కమిషనర్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, సోదాలు జరిగిన ప్రాంతాల్లోని CCTV ఫుటేజీలను, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని కూడా కోర్టు ఆదేశించింది.
రాజకీయ విమర్శలు:
ఈ తీర్పుపై బీజేపీ స్పందిస్తూ.. ఇది మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని, రాజ్యాంగం కంటే తామే పైనున్నామని భావించే వారికి ఇది ఒక గుణపాఠమని విమర్శించింది. మరోవైపు, ఎన్నికల సమయంలో తమ పార్టీ వ్యూహాలను దెబ్బతీసేందుకే ఈడీ ఇలాంటి దాడులకు పాల్పడుతోందని టీఎంసీ ఆరోపిస్తోంది. తాను అక్కడికి ముఖ్యమంత్రిగా వెళ్ళలేదని, కేవలం పార్టీ అధ్యక్షురాలిగా మాత్రమే వెళ్ళానని మమతా బెనర్జీ కోర్టుకు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..