హోటల్ క్లీనర్ నుంచి..ఏఐకి ప్రాణంగా ఎదిగి..
ABN , Publish Date - Nov 14 , 2026 | 03:23 AM
పుట్టిన దేశంలో బతకలేక సుదూరంలోని దేశానికి వలస వెళ్లిన ఒక బాలుడు.. అక్కడ జీవించటానికి పెద్ద పోరాటమే చేశాడు
ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ అసాధారణ విజయ యాత్ర
తైవాన్ నుంచి 9 ఏళ్ల వయసులో అమెరికాకు వలస.. స్కూల్లో వివక్ష
రెస్టారెంట్లో అంట్లు తోముతూ చదివి..మిత్రులతో కలిసి ఎన్విడియా స్థాపన
సంస్థను నం.1 చేసిన ప్రతిభాశాలి
మహిళలతో అనైతిక సంబంధాలతో స్థాపించిన సంస్థ నుంచే బయటకు
సీఈవో రేసులో భారతీయ అమెరికన్లు
వాషింగ్టన్, నవంబరు 13: పుట్టిన దేశంలో బతకలేక సుదూరంలోని దేశానికి వలస వెళ్లిన ఒక బాలుడు.. అక్కడ జీవించటానికి పెద్ద పోరాటమే చేశాడు. తాను చదువుకుంటున్న పాఠశాలలోనే మరుగుదొడ్లు కడిగాడు.. యుక్త వయసులో పొట్టపోసుకోవటానికి హోటల్‌లో టేబుళ్లు శుభ్రం చేశాడు.. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా కష్టపడి చదివి ఓ కంపెనీనే స్థాపించాడు. దానిని ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిపాడు. కానీ, చివరకు పరాయి మహిళలతో ప్రేమాయణం నడిపి ఆ కంపెనీనే వదిలేయాల్సి వచ్చింది.. అతడే ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్. జెన్సన్ అసలు పేరు జెన్ హుసన్.
ఆయన 1963లో తైవాన్‌లో జన్మించాడు. 9 ఏళ్ల వయసులో తన అన్నయ్యతో కలిసి అమెరికాలోని తన మేనమామ వద్దకు వలస వెళ్లాడు. అతడిని పొరపాటున కెంటకీలోని ఒక రిఫార్మింగ్ బోర్డింగ్ స్కూలులో చేర్పించారు. అక్కడ జెన్సన్ తీవ్రమైన జాతివివక్ష ఎదుర్కొన్నాడు. రోజూ శిక్ష పేరుతో అతడిచేత మరుగుదొడ్లు కడిగించేవారు. జెన్సన్ టీనేజ్‌కి వచ్చేనాటికి వారి కుటుంబం ఓరెగావ్‌లో స్థిరపడింది. అక్కడ అతడు ఉపాధి కోసం ఒక రెస్టారెంట్‌లో బల్లలు శుభ్రం చేశాడు.. అంట్లు తోమాడు. పనులు చేస్తూనే కష్టపడి చదివి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. 1993లో అంట్లు తోమిన రెస్టారెంట్‌లోనే కూర్చొని ఇద్దరు మిత్రులతో కలిసి ఎన్విడియా సంస్థకు పునాదులు వేశాడు. అయితే, ఆ కంపెనీ మొదట తయారుచేసిన రెండు చిప్‌లు ఫెయిల్ కావటంతో ఎన్విడియా మూతపడే స్థితికి వచ్చింది. ఆ సమయంలో తయారుచేసిన ‘రివా 128’ అనే చిప్ సూపర్‌హిట్ కావటంతో కంపెనీ నిలబడింది. దూరదృష్టిగల జెన్సన్ 20 ఏళ్ల క్రితమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాధాన్యాన్ని గుర్తించి.. దానికి అవసరమయ్యే చిప్‌ల తయారీపై దృష్టిపెట్టారు. ఇటీవల ఏఐ రంగం ఒక్కసారిగా విజృంభించటంతో ఎన్విడియా కూడా అదే స్థాయిలో ఎదిగింది. జెన్సన్ ఎప్పుడూ నల్లని టీ షర్ట్, దానిపై లెదర్ జాకెట్ ధరిస్తారు. అవే ఆయన బ్రాండ్‌గా మారాయి. కానీ, చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలిస్ హువాంగ్‌తో రహస్య ప్రేమాయణం నడిపిన ఆయన.. తాను స్థాపించిన కంపెనీకే దూరం కావాల్సి వచ్చింది. కాగా, అలిస్ హువాంగ్‌తోపాటు ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో జెన్సన్ రహస్య ప్రేమాయణం ఇప్పటికే బయటపడగా.. శుక్రవారం మరో మహిళతో కూడా ఆయనకు అలాంటి సంబంధం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఎన్విడియాకే చెందిన మరో ఉద్యోగినితో కూడా ఆయన సన్నిహితంగా మెలిగినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది.
సీఈవో రేసులో ముగ్గురు భారతీయ అమెరికన్లు
సీఈవో పదవికి జెన్సన్ గురువారం రాజీనామా చేయటంతో తదుపరి సీఈవో రేసులో ముగ్గురు భారతీయ అమెరికన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అమెరికాలో మెమరీ చిప్‌ల ఉత్పత్తిలో అతిపెద్ద కంపెనీ అయిన మైక్రాన్ సీఈవో సంజయ్ మెహ్రోత్రా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో పుట్టిన ఈయనకు చిప్ డిజైనింగ్ రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. 1988లో ఆయన మెమరీ చిప్‌ల కంపెనీ సన్‌డిస్క్‌ను స్థాపించారు. మైక్రాన్‌ను లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు. యూపీలోనే పుట్టిన పాలో ఆల్టో నెట్‌వర్క్ సీఈవో నికేశ్ అరోరా పేరు కూడా సీఈవో అభ్యర్థుల జాబితాలో ఉంది. ఎన్విడియా కంపెనీలోని వాటాదారులు ఈయనను సీఈవోగా బలంగా ప్రతిపాదిస్తున్నట్లు ఎకనమిక్ టైమ్స్ వార్తా సంస్థ తెలిపింది. కేరళంకు చెందిన థామస్ కురియన్ కూడా ఎన్విడియా సీఈవో రేసులో ఉన్నారు. ఈయన ప్రస్తుతం గూగు ల్ క్లౌడ్ సీఈవోగా ఉన్నారు. వీరితోపాటు ఎన్విడి యా సీఎఫ్ వో, ప్రస్తుతం తాత్కాలిక సీఈవో బాధ్యతలు నిర్వహిస్తున్న కొలెట్ క్రెస్, అదే సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఇయాన్ బక్, ఆర్మ్ సంస్థ సీఈవో రెనే హాస్, ఇంటెల్ మాజీ సీఈవో పాట్ గెల్సింజర్, ఎన్విడియా ప్రత్యర్థి కంపెనీ ఏఎండీ సీఈవో లీసా సూ, మార్వెల్ టెక్నాలజీ సీఈవో మాట్ మర్ఫీ, యాపిల్ చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్ జానీ స్రౌజీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్విడియా ఉద్యోగులు జెన్సన్ హువాంగే మళ్లీ సీఈవోగా రావాలని కోరుకుంటున్నారు. జెన్సన్ రాజీనామా తర్వాత ఎన్విడియా ప్రధాన కార్యాలయంలోని అంతర్గత అభిప్రాయాల బాక్స్‌లో దాదాపు 1,600 మంది ఉద్యోగులు తమ అభిప్రాయాలు తెలుపుతూ లేఖలు వేశారు.
ఇవి కూాడా చదవండి..
విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!
అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి