Share News

బంగ్లాదేశ్‌లో దారుణం.. కస్టడీలో హిందూ నాయకుడి మృతి

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:24 PM

బంగ్లాదేశ్‌లో మైనార్టీ వర్గం హిందువులు ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితులకు సంబంధించి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. అవామీ లీగ్‌కు చెందిన మాజీ నాయకుడు కస్టడీలో ప్రాణాలు విడిచారు.

బంగ్లాదేశ్‌లో దారుణం.. కస్టడీలో హిందూ నాయకుడి మృతి
Bangladesh Minority Crisis,

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌(Bangladesh)లో మైనార్టీలకు రక్షణ లేకుండాపోతోంది. అక్కడ నివసించే మైనార్టీ వర్గం హిందువులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అనేక మంది హిందువులు హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో అక్కడి దారుణ పరిస్థితులకు సంబంధించి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. అవామీ లీగ్‌కు చెందిన మాజీ నాయకుడు కస్టడీలో మరణించాడు. విద్యావేత్త, పార్లమెంటేరియన్‌, మాజీ మంత్రి అయిన రమేషన్‌ చంద్రసేన్‌ (86) గత 18 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇదే సమయంలో తన ఆరోగ్యం బాగాలేదని, బలహీనంగా మారుతున్నానని బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ, కోర్టులు మాత్రం చంద్రసేన్‌కు బెయిల్‌ ఇవ్వలేదు.


చంద్రసేన్ దాదాపు 18 నెలలుగా జైల్లో ఉన్నప్పటికీ.. అక్కడి ప్రజలకు ఆయనపై అభిమానం తగ్గలేదు. ఆయనకు మద్దతుగా పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రసేన్(Ramanesh Chandra Sen) ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు సైతం చేశారు. చంద్రసేన్ బంగ్లాదేశ్‌లో విద్యారంగం, రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా సేవలు అందించారు. 18 నెలల కిందట ఓ అల్లరిమూక ఆయనపై దాడి చేసింది. ఆ సమయంలో పోలీసులు దాడి చేసిన వారిని కాకుండా చంద్రసేన్‌నే అదుపులోకి తీసుకున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. అరెస్ట్‌కు గల కారణాలూ సరిగ్గా వెల్లడించలేదని పేర్కొన్నారు. ఇక నాటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఒక కేసు తర్వాత మరో కేసును చంద్రసేన్‌పై బనాయిస్తూనే వచ్చారని కుటుంబసభ్యులు ఆరోపించారు.


ఏ కేసులో అయినా బెయిల్‌పై బయటకు వస్తారనుకుంటే వెంటనే మరో కేసును మోపుతున్నారన్నారంటూ ఆవేదన చెందారు. ఇటీవల సేన్‌ ఆరోగ్య స్థితి బాగా క్షీణించడంతో చికిత్స తప్పని సరైంది. శనివారం రాత్రి చంద్రసేన్ పరిస్థితి విషమించడంతో కస్టడీలోనే ప్రాణాలు విడిచారు. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఏడాది జనవరి 11న అవామీ లీగ్‌ కు చెందిన మరో హిందూ నేత ప్రళయ్‌ చాకీ కూడా పోలీసుల కస్టడీలోనే మరణించారు. ఇటువంటి దారుణాలు బంగ్లాదేశ్ లో నిత్యకృత్యంగా మారాయని స్థానిక మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. 2025లోనే బంగ్లాదేశ్‌లో కనీసం 107 మంది ఖైదీలు కస్టడీలో మరణించారని, వీరిలో ఎక్కువ మంది అవామీ లీగ్ నాయకులు(Awami League Leader), కార్మికులేనని మానవ హక్కుల సంఘాలు తెలిపాయి.


ఇవి కూడా చదవండి:

భారత వ్యాక్సీన్లు లేక పాక్ విలవిల.. 2031 నాటికల్లా..

ఇతర సెలబ్రిటీల బాటలో బ్రెట్‌లీ! ఆస్ట్రేలియాను వీడి యూఏఈకి.. ఎందుకంటే..

Updated Date - Feb 08 , 2026 | 04:43 PM