Share News

భారత వ్యాక్సీన్లు లేక పాక్ విలవిల.. 2031 నాటికల్లా..

ABN , Publish Date - Feb 07 , 2026 | 06:03 PM

భారత్ నుంచి చవక ధరల టీకాల దిగుమతులు నిలిచిపోవడంతో పాక్ ఇక్కట్ల పాలవుతోంది. వెంటనే స్థానికంగా టీకాల ఉత్పత్తిని పెంచాలని పాక్ మంత్రి తేల్చి చెప్పారు.

భారత వ్యాక్సీన్లు లేక పాక్ విలవిల.. 2031 నాటికల్లా..
GAAVI V/accines in Pak

ఇంటర్నెట్ డెస్క్: అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్‌కు (Pakistan) భారత్‌ నుంచి అందుబాటు ధరల్లో టీకాలు నిలిచిపోవడంతో (Indian Vaccine Exports) ఇక్కట్లు పెరిగాయి. 2031 నాటికల్లా స్థానికంగా టీకాల ఉత్పత్తిని పెంచకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుందని పాక్ ఆరోగ్య శాఖా మంత్రి ముస్తాఫా కమాల్ తాజాగా హెచ్చరించారు.

పాక్ ప్రస్తుతం ఏటా సగటున 400 మిలియన్ డాలర్లు విలువైన టీకాలను గావీ (GAAVI) అనే అంతర్జాతీయ కూటమి సహకారంతో దిగుమతి చేసుకుంటోంది. ఈ ఖర్చులో 49 శాతం అంతర్జాతీయ సంస్థలు భరిస్తుండగా మిగిలిన డబ్బును పాక్ ప్రభుత్వం చెల్లిస్తోంది.

పేదదేశాల్లో పిల్లలకు టీకాలు అందుబాటులో ఉండేందుకు గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ (గావీ - GAVI) కృషి చేస్తోంది. వివిధ దేశాల నుంచి తక్కువ ధరకు టీకాలను సేకరించి పేద దేశాలకు సరఫరా చేస్తుంటుంది. గావీకి పంపించే టీకాల్లో అధిక శాతం భారతీయ సంస్థల్లో తయారవుతుంటాయి.


భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు ఎన్ని ఉన్నప్పటికీ గావీ ద్వారా టీకాల సరఫరా చాలా కాలం పాటు కొనసాగింది. అయితే, గతేడాది ఇరు దేశాల ఉద్రిక్తతల పతాకస్థాయికి చేరుకున్నాక భారత్ నుంచి టీకాల సరఫరా నిలిచిపోయింది.

ప్రస్తుతం పాక్ ప్రభుత్వం తమ దేశ ప్రజలకు 13 రకాల టీకాలను ఉచితంగా అందిస్తోంది. ఇవన్నీ విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2031 కల్లా టీకా దిగుమతుల ఖర్చు 1.2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పాక్ మంత్రి హెచ్చరించారు. స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - Feb 07 , 2026 | 06:10 PM