ఇతర సెలబ్రిటీల బాటలో బ్రెట్‌లీ! ఆస్ట్రేలియాను వీడి యూఏఈకి.. ఎందుకంటే..
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:07 PM
దుబాయ్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న సెలబ్రిటీల్లో తాజాగా క్రికెట్ లెజెండ్ బ్రెట్ లీ కూడా వచ్చి చేరారు. దుబాయ్‌లో ఇదీ అని స్పష్టంగా చెప్పలేని ప్రత్యేకత ఏదో ఉందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు దుబాయ్ ప్రత్యేకతల ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో సంపన్నులు, సెలబ్రిటీలు తమ సొంత దేశాలను వీడి యూఏఈలో సెటిల్ అవుతున్నారు. ఈ జాబితాలో తాజాగా క్రికెట్ లెజెండ్ బ్రెట్ లీ కూడా వచ్చి చేరారు. తాను యూఏఈకి శాశ్వతంగా మకాం మార్చినట్టు ఇన్‌స్టాలో ఆయన వెల్లడించారు (Brett Lee Settles in Dubai).
‘ఆస్ట్రేలియా ఎప్పటికీ నా మనసుకు దగ్గరగా ఉంటుంది. అక్కడ లభించిన జీవితానికి ఎంతో కృతజ్ఞతతో ఉన్నా. ఇందులో ఎప్పటికీ మార్పు ఉండదు. కానీ, దుబాయ్‌లో ఇదీ అని స్పష్టంగా చెప్పలేని విషయం ఏదో ఉంది. ఇక్కడ ఎనర్జీ వేరు.. ఏదైనా సాధ్యమే అన్న భావన కుగుతుంది. ఇక్కడకు వచ్చే వారెవరూ నిరాశ చెందరు’ అని పేర్కొన్నారు. దుబాయ్‌లో తాను తీసుకున్న కొన్ని ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేశారు.
యూఏఈ బాట పడుతున్న సెలబ్రిటీలు! ఎందుకంటే..
అంతర్జాతీయ ప్రముఖులతో పాటు భారత్‌కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు యూఏఈకి ఇప్పటికే మకాం మార్చారు. స్విమ్మింగ్‌లో రాణిస్తున్న తన తనయుడి కెరీర్ కోసం నటుడు మాధవన్ తన కుటుంబంతో సహా దుబాయ్‌కు మారారు. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా కూడా డైవర్స్ తరువాత దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భార్య తమ పిల్లల చదువుల కోసం దుబాయ్‌లోనే ఉంటున్నారు. పాప్ స్టార్ యో యో హనీ సింగ్, నటి రాఖీ సావంత్ కూడా దుబాయ్‌కు వెళ్లిపోయారు.
దుబాయ్‌లో ఉంటే కలిగే ఆర్థిక ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను ఆకర్షిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రైవెసీని కాపాడేలా కట్టుదిట్టమైన చట్టాలు, జీవనశైలి భద్రత వంటివన్నీ సంపన్నులను దుబాయ్‌కు క్యూకట్టేలా చేస్తున్నాయి. దుబాయ్‌లో ఉండే వారు ప్రపంచంలోని పలు ఇతర ప్రముఖ ప్రాంతాలకు కేవలం 8 గంటల్లోనే వెళ్లొచ్చు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే ఇంటర్నేషనల్ స్కూల్స్, అత్యాధునిక వైద్య వసతులు, విలాసవంతమైన లైఫ్ స్టైల్ కోసం సంపన్నులు క్యూకడుతున్నారు.
దుబాయ్‌లోని ట్యాక్స్ వ్యవస్థే అత్యంత ప్రధాన ఆకర్షణ అని కూడా పరిశీలకులు కొందరు చెబుతారు. అక్కడి వారు వ్యక్తిగత పన్నును చెల్లించాల్సిన అవసరం ఉండదు. అధిక సంపదపై విధించే పన్ను లేదా వారసులకు ఆస్తుల బదిలీపై విధించే పన్ను బెడద కూడా ఉండదు. కార్పొరేట్ కంపెనీల లాభాలపై.. అదీ ఓ మోస్తరు స్థాయిలో పన్ను కడితే సరిపోతుంది. ఫలితంగా అక్కడ చిన్న, మధ్య స్థాయి వాణిజ్య వ్యాపారాల ఎదుగుదలకు అవకాశాలు ఎక్కువన్న అభిప్రాయం ఉంది.
దుబాయ్‌లో రాజకీయ సుస్థిరత, నేరాల శాతం తక్కువగా ఉండటం, మెరుగైన భద్రత వంటి వాటి వల్ల సెలబ్రిటీలు తమ కుటుంబాలతో సహా అక్కడకు మకాం మారుస్తున్నారు. కఠినమైన ప్రైవెసీ చట్టాలు సినీ ప్రముఖులను ఆకర్షిస్తున్నాయి. దుబాయ్‌లో అనుమతి లేకుండా అవతలి వారి ఫొటోలు తీయడం నిషిద్ధం. విలేకరుల హడావుడి కూడా ఉండదు.
దుబాయ్ ఇస్లామిక్ దేశమైనప్పటికీ మతపరమైన అంశాల్లో ఇతర మధ్య ప్రాచ్య దేశాలతో పోలిస్తే ఉదారవాద విధానాలను అనుసరిస్తుంది. ముస్లిమేతరుల కోసం దేశవ్యాప్తంగా సివిల్ పర్సనల్ స్టేటస్ చట్టం అమల్లో ఉంది. ఇక లివ్-ఇన్ రిలేషన్ షిప్స్‌ను కూడా నేరంగా పరిగణించొద్దని కొంత కాలం క్రితం యూఏఈ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు, సంపన్నులు దుబాయ్‌కు క్యూకడుతున్నారని సమాచారం.